ఓరుగల్లు9నేషనల్ టీవీ ప్రతినిధి విజయవాడ: కేంద్రంలో మోదీ, ఏపీలో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వాలను సాగనంపడమే తమ విధానమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వచ్చే అసెంబ్లీ ఎన్నికల పొత్తులపై స్పందించారు..తమతో కలిసి వచ్చేవారితో పొత్తులు పెట్టుకుంటామని చెప్పారు. మోదీ, జగన్‌లు.. దేశాన్ని, రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని మండిపడ్డారు.
”జగన్ దోపిడీ, అరాచకాలతో ప్రజలు విసిగిపోయారు. తెలంగాణ కంటే ఏపీ ఎంతో వెనుకబడి పోయింది. రాష్ట్రంలో జగన్ రివర్స్ పాలన చేస్తున్నారు. అన్ని రంగాలను అంధకారంలోకి నెట్టారు. ఐటీ అనేది ఏపీలో లేకుండా చేశారు. జగన్‌కు కనీసం సిగ్గు కూడా లేదు. పోలవరం, పరిశ్రమలు, ఐటీ గురించి సీఎం మాట్లాడటం లేదు. పోలీసులను అడ్డం పెట్టి అక్రమ కేసులతో ఇబ్బందులు పెడుతున్నారు. ఏపీలో ప్రధాన ప్రతిపక్షం తెదేపా కాబట్టి… వాళ్లతో కలిసి పని చేసే ఆలోచన చేస్తున్నాం..
జగన్ అధికారంలోకి రాకుండా ఉండేందుకు మా వంతు కృషి చేస్తాం. మోదీ, అమిత్‌షాల ప్రమేయం లేకుండా చంద్రబాబును జైల్లో పెడతారా? మోదీ జగన్‌లు కలిసి దోచుకున్నారు. ఇప్పుడు కలిసే చంద్రబాబును జైలుకు పంపారు. తెదేపా, జనసేన కూడా ఒకసారి ఆలోచన చేయాలి. వాళ్లు భాజపాతో తెంచుకుని వస్తే మేము స్వాగతిస్తాం. భాజపాతో వాళ్లు వెళ్తే.. జగన్ నెత్తిన పాలు పోసినట్లే. మోదీ సహకారం లేకుండా జగన్ ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేరు. దేశం, రాష్ట్రం బాగు పడాలంటే మోదీ, జగన్‌లను ఓడించాలి” అని రామకృష్ణ వ్యాఖ్యానించారు