డ్రగ్స్ దేశాన్ని నాశనం చేస్తోందని, మత్తు పదార్థాలకు అలవాటు పడి యువత ఆగం అవుతోందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. డ్రగ్స్ నుండి యువతను రక్షించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇకపై డ్రగ్స్, గంజాయి గురించి నిద్రలో ఆలోచించినా భయపడే పరిస్థితి తీసుకువస్తామన్నారు. రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయి మూలాలను ఒక్కొక్కటిగా ఏరివేస్తున్నామని అన్నారు. ఆదివారం గచ్చిబౌలిలో బ్రహ్మకుమారీస్-శాంతి సరోవర్ ద్వి దశాబ్ధి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యారు.
ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చిన 9 నెలల్లోనే అసెంబ్లీ ఎన్నికల్లో హామీ ఇచ్చిన రూ.2 లక్షలు రుణమాఫీ చేసిన చరిత్ర మా ప్రభుత్వానిదన్నారు. రైతు సంతోషంగా ఉన్నప్పుడే రాజ్యం సంతోషంగా ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు సీఎం రేవంత్. మాది రైతు ప్రభుత్వం అని నిరూపించుకోవడానికి ఇచ్చిన మాట ప్రకారం రూ.2లక్షల రుణమాఫీ చేశామని గుర్తు చేశారు. రైతులన్ని రుణవిముక్తుల్ని చేసేందుకు మా ప్రభుత్వం కృషి చేసిందన్నారు. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు ఉండొద్దనేదే తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు.