ఏంతింటున్నామో తెలుసా? – వాస్తవాలు తెలిస్తే వాంతులే! –
కుళ్ళిన మాంసం, రంగులు చల్లిన చికెన్
కుళ్లిపోయిన కూరగాయలు…
ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలలో బయలుపడ్డ వాస్తవాలు…
ఓరుగల్లు9 నేషనల్ టివి నిర్మల్ జిల్లా ప్రతినిధి, ఏప్రిల్ 17 :
బయటకు వెళ్లి ఏదైనా తినాలని అనుకుంటున్నారా? అయితే ఒక్కసారి ఆలోచించాల్సిందే! ఎందుకంటే కంటికి ఇంపుగా కనిపించే ఆహార పదార్థాలన్నీ మేలైనవి కావు. అందులో నాసిరకం ఉండొచ్చు. ప్రమాదకరమైన పదార్థాలూ కలవొచ్చు. ఆహార భద్రత అధికారులు హోటళ్లలో నిర్వహించిన తనిఖీల్లో ఇలాంటి నివ్వెరపోయే అంశాలు వెలుగులోకి వచ్చాయి.ఏ సీజన్లో అయినా డల్ అవ్వని బిజినెస్ ఏదైనా ఉందంటే అది ఫుడ్ బిజినెస్ మాత్రమే. కానీ హోటళ్ల పేరుతో కొంతమంది చేస్తున్న అక్రమాలు తెలిసి, బయట ఫుడ్ తినాలంటేనే ఆలోచించాల్సి వస్తోంది. ఎందుకంటే పురుగులు పట్టిన, కాలం చెల్లిన ఆహార పదార్థాలు, కల్తీ మసాలాలు, మళ్లీ మళ్లీ కాచి వాడుతున్న నూనెలు, అపరిశుభ్రమైన వంటశాలలు కావడమే ఇందుకు నిదర్శనం. నిర్మల్ లోని పలు హోటళ్లు, రెస్టారెంట్లు,బేకరీలు, ఐస్క్రీం పార్లర్లు, కాఫీ షాప్లలోనూ ఇదే పరిస్థితి.సాధారణ హోటళ్లలోనే కాదు ప్రముఖ రెస్టారెంట్లలోనూ ఇదే దుస్థితి నెలకొంది. నోరూరించే వాసనలు, ఆకర్షణీయ రంగులు, వేడివేడిగా వడ్డన ఆకట్టుకుంటున్నా తింటే అనారోగ్యం తథ్యం.
జిల్లాలో పలు రెస్టారెంట్లు, కన్ఫెక్షనరీ డ్రై ఫ్రూట్స్, మిఠాయి తయారీ కేంద్రాలపై రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ టాస్క్ఫోర్స్ బృందం ఆకస్మిక దాడులు నిర్వహించింది.బుధవారం జిల్లా కేంద్రంలోని పలు రెస్టారెంట్లు,తినుబండారాల తయారీ కేంద్రాలు, మిఠాయిల డ్రై ఫ్రూట్స్ దుకాణాలలో రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ టాస్క్ఫోర్స్ బృందం ఆకస్మిక సోదాలు నిర్వహించింది. ఈ ఫుడ్ సేఫ్టీ సోదాల్లో భాగంగా పట్టణంలోని మయూరి హోటల్, బంధన్ స్వీట్ షాప్, దత్తత్రేయనగర్ లోని డ్రై ఫ్రూట్ హౌస్ లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. తనిఖీలు నిర్వహించిన రెస్టారెంట్లలో వంట గది, రిఫ్రిజిరేటర్ లు పూర్తిగా అపరిశుభ్రంగా ఉండడం జరిగిందని ఫుడ్ సేఫ్టీ అధికారులు తెలిపారు. సుమారు పదివేల రూపాయల విలువ కలిగిన నిలువ చేసిన కుళ్ళిన మాంసపు ఉత్పత్తులను, హానికర, ప్రమాదకరమైన రంగులను కలిపిన చికెన్, కాలం చెల్లిన సాస్, లేబుల్ డిఫెక్ట్స్ కలిగిన పన్నీర్, పూర్తిగా అపరిశుభ్ర వాతావరణంలో నిల్వ ఉంచిన కూరగాయలను గుర్తించామన్నారు. పట్టణంలోని ఐఎఫ్సి రెస్టారెంట్ నందు స్టోర్ రూమ్ లో పూర్తిగా అపరిశుభ్ర వాతావరణంలో ఎలుకల విసర్జితాలతో కూడిన సుమారు 5000 రూపాయల విలువగల ముడి సరుకులను గుర్తించి హోటల్ యాజమాన్యంపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్లు తెలిపారు. ఆ వస్తువులను ధ్వంసం చేసి, ఎఫ్ఎస్ఎస్ చట్టం 2006 ను పాటించనందుకు నోటీసులను జారీ చేశామన్నారు. దత్తాత్రేయనగర్ లో గల డ్రై ఫ్రూట్ హౌస్ లో తనిఖీ చేయగా నిర్వాహకులు ఎటువంటి పరిశుభ్రత ప్రమాణాలు, వ్యక్తిగత పరిశుభ్రత పాటించకపోవడం, అధిక మోతాదులో రంగులు కలిపినటువంటి ఆహార పదార్థాలను,లేబుల్ డిఫెక్ట్స్ కలిగిన రెడీ టు ఈట్ సేవరిస్ అయినటువంటి కార మురుకులు ,పచ్చి బటాని ఇతర అనుమానిత ఆహార పదార్థాల శాంపిళ్లను పరీక్ష నిమిత్తం హైదరాబాదులో గల ల్యాబ్ కు పంపించడం జరిగిందన్నారు. ప్రజల ప్రాణాలకు నష్టం కలిగించే విధంగా హానికర ఆహార పదార్థాలను విక్రయించవద్దని, నాణ్యతా ప్రమాణాలను పాటించని వారిపై కఠిన చర్యలు ఉంటాయని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు.
ఈ ఆహార నాణ్యత తనిఖీల్లో రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ టీం హెడ్, జోనల్ అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ వి.జ్యోతిర్మయి, టాస్క్ ఫోర్స్ ఫుడ్ ఇన్స్పెక్టర్స్ రోహిత్ రెడ్డి ,స్వాతి, శ్రీషిక, జగన్నాధం, తదితరులు పాల్గొన్నారు.

కుళ్లిపోయిన క్యాబేజీ