ఓరుగల్లు9 నేషనల్ టివి నిర్మల్ జిల్లా ప్రతినిధి, ఏప్రిల్ 18 :
ఉపాధి హామీ కూలీలకు శటగోపం…
చేతివాటం చూపుతున్న స్థానిక ఫీల్డ్ అసిస్టెంట్లు, అధికారులు….
గ్రామీణ ప్రాంతాల్లో జీవనోపాధి భద్రతను పెంచడం కొరకు ఒక ఆర్థిక సంవత్సరంలో 100 రోజులు పని కల్పిస్తూ వేతనాన్ని అందించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉపాధి హామీ పథకాన్ని ప్రారంభించాలి. ప్రతి పేద కుటుంబంలోని వయోజనులకు ఆర్థిక భరోసా కల్పించి 100 రోజులకు పని కల్పించాలని లక్ష్యంగా ప్రభుత్వం ఈ పథకాన్ని ఏర్పాటు చేయగా ప్రభుత్వ ఉద్దేశాన్ని ప్రక్కదోవ పట్టిస్తూ ఉపాధి హామీ కూలీలతో చేయించాల్సిన పనులను యంత్రాల సహాయంతో చేయిస్తూ పథకాన్ని నీరుగార్చేలా వ్యవహరిస్తున్నారు కొందరు అధికారులు. ఇలా ఎందుకు చేస్తున్నారు అని ప్రశ్నిస్తే సంబంధంలేని జవాబులు చెబుతూ ప్రశ్నను దాటవేస్తున్నారు. వివరాల్లోకి వెళితే నర్సాపూర్ (జి) మండలం ఆర్లి గ్రామంలో ఫిష్ పాండ్ ఏర్పాటు చేయడానికి గ్రామపంచాయతీ గ్రామసభలో తీర్మానం చేసి దానికి అనుగుణంగా కొన్ని రోజులు ఉపాధి హామీ కూలీలతో పని చేయించి అనంతరం అక్కడ జెసిబి సహాయంతో పని చేయిస్తున్నారు. ఈ విషయమై సదరు ఫీల్డ్ అసిస్టెంట్ మా ప్రతినిధి అడగగా తనకు ఈ విషయం తెలియదంటూ సమాధానం దాటవేశారు. అనంతరం సంబంధిత ఏపిఓ ను ఉపాధి హామీ కూలీలతో చేయించాల్సిన పనిని యంత్రాల సహాయంతో చేయిస్తున్నారని వారి దృష్టికి తీసుకువెళ్లగా సదరు విషయం తమ దృష్టికి రాలేదని, కూలీలతో పని చేయించకుండా యంత్రాలతో పని చేయిస్తే దానికి సంబంధించిన డబ్బులను ఉపాధి హామీ పథకం కింద ఇవ్వడం జరగదని తెలిపారు. మరి సమాచారం ఇవ్వకుండా యంత్రాలతో పని చేయించినప్పుడు సదరు వ్యక్తులపై ఏవైనా చర్యలు తీసుకుంటారా అని మా ప్రతినిధి ప్రశ్నిస్తే సదరు యంత్రాలను ఉపయోగించి పూడికతీతల పనిచేసిన ప్రదేశం తమ పరిధిలోకి రాదని సమాధానాన్ని దాటవేశారు. ఇదే విషయమై మండల ఎంపీడీవోను ప్రశ్నించగా రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని, వార్తా పత్రికలలో వస్తే ఇలాంటి స్పందన ఉండదని చెప్పారు. వారి దృష్టిలో వార్తాపత్రికల ద్వారా నిజాలను బయటకు తీస్తే వాటి పైన ఎలాంటి చర్యలు తీసుకోమని చెప్పకనే చెబుతున్నారు. అంటే ప్రతి జర్నలిస్టు నిజాలు బయటకు తీసే ముందు అధికారులకు ఫిర్యాదు చేయాలా అని ప్రశ్నించగా వారు ఎలాంటి సమాధానం చెప్పకుండా ప్రశ్నను దాటవేశారు. నిజాలను వెలికి తీసి పత్రికలలో ప్రచురితం చేసినప్పుడు అందులోని వాస్తవికతను తెలుసుకొని, అధికారులపై చర్యలు తీసుకోవడం లేదా పత్రిక ద్వారా ప్రజలకు వివరణ ఇవ్వడం జరుగుతుంది. కానీ ఇక్కడ దానికి విరుద్ధంగా ఫిర్యాదు చేస్తేనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు వెళ్తాం అని సంబంధిత ఎంపీడీవో చెప్పడం గమనార్హం. ఇకనైనా సంబంధిత అధికారులు స్పందించి ఫిష్ పాండ్ తవ్వకములు యంత్రాలను ఉపయోగించిన విషయమై విచారణ జరిపి సదరు వ్యక్తులపై, అలసత్వం వహించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.