ఓరుగల్లు9నేషనల్ టివి ప్రతినిధి:-తెలంగాణ రాష్ట్ర అధికారిక లోగో నుంచి చార్మినార్ ను కాంగ్రెస్ ప్రభుత్వం తొలగించడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ నిరసన వ్యక్తం చేస్తూ.. చార్మినార్ ముందు ధర్నా చేపట్టారు. కేటీఆర్‌కు మద్దతుగా బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు చార్మినార్ వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర పూరితంగా వ్యవహరిస్తోందని, ఉద్దేశపూర్వకంగానే రాజముద్ర మార్పు చేస్తోందని విమర్శించారు. తెలంగాణ చారిత్రక చిహ్నాలను తొలగిస్తోందని, లోగోలో చార్మినార్‌ను తొలగించడమంటే హైదరాబాద్‌ను అవమానించడమేనని అన్నారు. కాకతీయుల కళా తోరణాన్ని ఎలా తొలగిస్తారని కేటీఆర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
హైదరాబాద్ అంటే అందరికీ గుర్తొచ్చేది చార్మినారని తెలిపారు. ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా వ్యవహరించొద్దని సూచించారు. కాగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కక్షతోనే మార్పు చేస్తున్నదని తెలిపారు. రాజముద్రను ఇంత అత్యవసరంగా మార్చాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. హైదరాబాద్ ప్రగతిని కనిపించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నదని విమర్శించారు. కేసీఆర్ పేరు కనిపించకుండా మూర్ఖపు నిర్ణయాలు తీసుకుంటున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. లోగోలో చార్మినార్‌ను తొలగించడం అంటే హైదరాబాదీలను అవమానించడమేనన్నారు. అమరవీరుల స్థూపం, తెలంగాణ సాంస్కృతిక చిహ్నాలను చేర్చితే అభ్యంతరం లేదని చెప్పారు. అధికారిక చిహ్నంలో మార్పు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా నిరసన చేపడతామని హెచ్చరించారు.