Friday, November 15, 2024

జిల్లాలో జరుగుతున్న ప్రతి విషయం పోలీసులకు తెలిసి ఉండాలి-జోగులాంబ గద్వాల జిల్లా ఎస్పీ రితిరాజ్ఓరగల్లు9నేషనల్ టీవీ

జోగులాంబ గద్వాల జిల్లా
ఓరగల్లు9నేషనల్ టీవీ ప్రతినిధి :- జోగులాంబ గద్వాల జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలోని అంతర్ రాష్ట్ర చెక్ పోస్టులు, ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో ప్రతి వాహనాలను క్షుణ్ణంగా పరిశీలించి తనిఖీలు నిర్వహించాలని జిల్లా ఎస్పీ రితిరాజ్ పోలీస్ అధికారులకు, సిబ్బందికి సూచించారు. ఎన్నికల కోడ్ పర్యవేక్షణలో భాగంగా గురువారం జిల్లా ఎస్పీ కేటీ దొడ్డి, గట్టు పోలీస్ స్టేషన్లను, నందిన్నే, బల్గేర చెక్ పోస్టులను సందర్శించి, సిబ్బంది విధులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ అధికారులతో, సిబ్బందితో ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు ప్రతి ఒక్కరు బాధ్యతతో పనిచేయాలన్నారు. సరిహద్దు పోలీసులతో సమన్వయంతో పనిచేయాలని, ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. గ్రామాలలో ప్రచారాలు చేసే క్రమంలో పోలీస్ సిబ్బంది షాడో పార్టీగా ఉంటూ నిఘా ఉంచాలన్నారు. మైక్, ప్రచార అనుమతులు ఇచ్చిన సమయంలోనే పూర్తి చేసుకునేటట్లు చూడాలని అన్నారు. గ్రామాలలో ఏ రోజు ఏమి జరుగుతుందో ప్రతి విషయం పోలీసుల దగ్గర ఉండాలన్నారు. పోలీస్ స్టేషన్ల పరిధిలో ఎన్నికలకు సంబంధించి గ్రామాలలో జరిగే ప్రతి విషయం పోలీసులకు తెలిసి ఉండాలని అన్నారు. జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమావళిని కట్టుదిట్టంగా అమలు చేయాలని, నగదు, మద్యం, ఉచిత పంపిణీలపై ప్రత్యేక నిఘా ఉంచాలని అన్నారు. ఎలక్షన్ కోడ్ అమలులో ఉన్నందున పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఎన్ఫోర్స్మెంట్ వర్క్ పకడ్బందీగా చేపట్టాలని, ఎవరైనా ఓటర్లను ప్రలోభపెట్టే ఎలాంటి చర్యలకు దిగినా సంబంధిత వ్యక్తులపై ఎంసిసి వాయిలేషన్ కేసులు నమోదు చేయాలన్నారు. సి-విజిల్ యాప్ లోని ఫిర్యాదులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ సంబంధిత అధికారులకు తెలియజేయాలని సిబ్బందికి సూచించారు. పోలీస్ స్టేషన్ల పరిధిలో విస్తృతంగా తనిఖీలు చేపట్టి ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని అన్నారు. సరైన ఆధారాలు లేకుండా రూ. 50వేల కంటే ఎక్కువ మొత్తంలో డబ్బులను తీసుకెళ్తే సీజ్ చేయాలని, గ్రామాలలో బెల్ట్ షాపులపై నిఘా ఉంచి లిక్కర్ ను సీజ్ చేసి కేసులు నమోదు చేయాలన్నారు. అత్యవసర వైద్యం, కళాశాల ఫీజులు, వ్యాపారం, పెళ్లిళ్లు, ఇతర అవసరాలకు డబ్బులను తీసుకెళ్తున్న వారు సరైన పత్రాలతో డబ్బులు తీసుకెళ్లేటట్లు అవగాహన కల్పించాలని సూచించారు. చెక్ పోస్ట్ అధికారులు, సిబ్బంది వాహనాల తనిఖీ పకడ్బందీగా నిర్వహించాలని, ఎప్పుడూ అప్రమత్తంగా వ్యవహరించాలని, ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని అధికారులకు, సిబ్బందికి ఎస్పీ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో గద్వాల సిఐ శ్రీనివాస్, కేటీ దొడ్డి, గట్టు ఎస్సైలు వెంకటేష్, నందికర్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular