రాష్ట్రానికి దగ్గు, జ్వరం🩺
గత 15-20 రోజులుగా తీవ్రత ఎక్కువ.. పెరుగుతున్న కేసులు
శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల వల్లే.. ఇంట్లో అంతా బాధితులే
గాలి ద్వారా ఒకరి నుంచి మరొకరికి.. మాస్క్ తప్పనిసరి
హైదరాబాద్‌తో పాటు.. రాష్ట్రమంతా దాదాపు ఇదే స్థితి
ఓరుగల్లు9నేషనల్ టీవీ ప్రతినిధి హైదరాబాద్: తెలంగాణ అంతా దగ్గు, జ్వరం పట్టుకుంది! ఏ ఇంట్లో చూసినా ఇద్దరు, ముగ్గురు.. కొన్నిచోట్ల ఇంట్లో అందరూ ఖళ్.. ఖళ్ అంటూ.. ఫీవర్‌తో వణుకుతున్న వారే ఉంటున్నారు! దగ్గుతో బాధపడేవారి సంఖ్య అయితే రోజురోజుకూ పెరుగుతోంది. శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల వల్లే ఈ సమస్య ఏర్పడిందని.. గాలి ద్వారా ఒకరి నుంచి మరొకరికి దగ్గు, జ్వరం వస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. హైదరాబాద్ సహా రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. ప్రధానంగా గత పదిహేను, ఇరవై రోజుల నుంచి ఈ సమస్య తీవ్రత ఎక్కువగా ఉంటున్నట్లు వైద్యవర్గాలు వెల్లడించాయి. పాఠశాలల్లో అయితే దగ్గు వినిపించని తరగతి ఉండటం లేదని ఉపాధ్యాయులు అంటున్నారు. ఇక ఆఫీసుల్లోనూ దాదాపు ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఫలితంగా కొన్నాళ్లుగా ఆస్పత్రుల్లో ఔట్ పేషంట్ల తాకిడి బాగా పెరిగింది. హైదరాబాద్ నల్లకుంటలోని ఫీవర్ ఆస్పత్రిలో రోజూ సాధారణంగా 400-500 మంది రోగులు వస్తుంటారు. కానీ గత పది పదిహేను రోజులుగా ఓపీ కేసులు రెట్టింపవుతున్నాయి. మంగళవారం ఫీవర్ ఆస్పత్రిలో 1050 మంది ఓపీ వచ్చారు. వచ్చిన ఓపీలో 80 శాతం మంది దగ్గు, జ్వరం, జలుబు బాధితులే. అంటే ఏ స్థాయిలో దగ్గు బాధితులున్నారో అర్థం చేసుకోవచ్చు. ఒక్క ఫీవర్ ఆస్పత్రినే కాదు మిగిలిన సర్కారు, ప్రైవేటు దవాఖానాల్లోనూ దాదాపు ఇదే పరిస్థితి నెలకొన్నట్లు వైద్యులు చెబుతున్నారు.
నెల రోజుల నుంచి చిన్న పిల్లల వైద్యుల వద్దకు వచ్చే వారి సంఖ్య రెట్టింపయింది. ఈ పరిస్థితుల్లో మాస్కు ధరించాలని వైద్యులు సూచిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రెస్పరెటరీ ఇన్ఫెక్షన్లు ఉన్నట్లు వైద్యవర్గాలు తెలిపాయి. ఈ రెస్పరేటరీ ఇన్పెక్షన్లు ఇంట్లో ఒకరికి ఉంటే అందరికీ వస్తోంది. దగ్గినప్పుడు వచ్చే తుంపర్లతో గాలి ద్వారా ఇతరులకు సులభంగా సోకుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. వాతావరణంలో కలిగిన మార్పుల కారణంగా పెద్దల నుంచి పిల్లల వరకు అందరూ తీవ్రమైన దగ్గు, జ్వరం, జలుబు, శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్నారు. రాష్ట్రంలో దాదాపు అన్నిచోట్లా జర్వం, జలుబు,దగ్గుతో బాధపడుతూ ఆస్పత్రులకు వచ్చే వారి సంఖ్య బాగా పెరిగినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖఉన్నతాధికారులు ధ్రువీకరించారు. చిన్నారుల్లో అయితే రోజుల తరబడి జలుబు, దగ్గు సమస్యలు వేధిస్తున్నాయి. వీటికి తోడు శ్వాసకోశకు సంబంధించిన సమస్యలు కూడా బాగా పెరిగినట్టు వైద్యులు చెబుతున్నారు. నిరుడు ఇదే సీజన్‌లో ఇంతలా ఇటువంటి వ్యాధుల ప్రభావం లేదని, గత ఏడాదితో పోల్చితే ఈమారు సమస్య చాలా తీవ్రంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. వీటితో పాటు డెంగీ, టైఫాయిడ్, గ్యాస్ట్రోసిస్ కేసులు కూడా పెరుగుతున్నాయని వైద్య వర్గాలు తెలిపాయి. సాధారణంగా వారం రోజులు ఉంటే దగ్గు, జలుబు లాంటి సమస్యలు తగ్గిపోతాయి. కానీ ఈసారి మాత్రం అవి నెల రోజుల పాటు వేధిస్తున్నాయి. యాంటీబయాటీక్స్ వాడినా కూడా ఉపయోగం ఉండటం లేదు.
లక్షణాలు ఇలా…
తీవ్రమైన దగ్గు ఉంటుంది. గొంతు గరగర అనిపిస్తుంది. కొందరిలో పొడిదగ్గు ఉంటుంది. ఎక్కువ మందిలో తెమడతో కూడి దగ్గు వస్తోంది. రోజుల తరబడి ఉంటుంది. దగ్గుతో పాటు జలుబు, జ్వరం, ముక్కుకారడం, తలనొప్పి, వాంతులు ఉంటున్నాయి. రోజుల తరబడి దగ్గు తగ్గకపోవడం కనిపిస్తుంది.
ఈ జాగ్రత్తలు తప్పనిసరి
చలి గాలిలో తిరగడం మానుకోవాలి. బయటకు వెళితే మాస్కు ధరించాలి. చల్లని ఆహార పదార్ధాల జోలికి వెళ్లకూడదు. గొంతు గరగరగా ఉంటే గోరు వెచ్చటి నీటిలో కొంచెం ఉప్పు వేసుకొని గార్లింగ్ చేయాలి. దగ్గుతో బాధపడే చిన్నారులను పాఠశాలకు పంపొద్దు. మూడు నాలుగు రోజులైనా దగ్గు, జ్వరం తగ్గకుంటే వెంటనే డాక్టర్‌ను సంప్రందించాలి.
మాస్కులు తప్పనిసరి
వాతావరణంలో మార్పుల వల్ల ఫ్లూ వైరస్ విజృంభిస్తోంది. ఫీవర్ ఆస్పత్రికి వచ్చే ఓపీ ఒక్కసారిగా రెండు రెట్లు పెరిగింది. ప్రధానంగా జ్వరం, జలుబు, దగ్గుతో వచ్చే రోగులు ఎక్కువగా ఉన్నారు. ఫ్లై వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంది. కొవిడ్ తర్వాత మాస్కులు వాడటం లేదు. పబ్లిక్ ప్లేసులకే వెళితే మాస్కులు తప్పనిసరిగా వాడాలి. ఎవరికైనా జలుబు, దగ్గు ఉంటే వారి నుంచి ఇతరులకు చాలా వేగంగా వ్యాప్తి చెందుతోంది. మూడు రోజుల పాటు జ్వరం తగ్గకుండా ఉంటే వెంటనే టెస్టులు చేయించుకోవాలి. దగ్గు ఎంతకీ తగ్గకపోతే నెబులైజర్ వాడాలి. నెబులైజర్ వాడిన వారిలో మూడు నాలుగు రోజుల్లోనే దగ్గు తగ్గిపోవడం గమనించాం. ప్రస్తుతం దాన్నే ఎక్కువగా రికమండ్ చేస్తున్నాం.