Monday, December 23, 2024

బాలికలు క్రీడల్లో ప్రతిభను చాటాలి- కలెక్టర్ ప్రావీణ్య-ఓరుగల్లు9నేషనల్ టీవీ

ఓరుగల్లు9నేషనల్ టీవీ ప్రతినిధి: బాలికలు వివిధ క్రీడాంశాల్లో అత్యుత్తమ ప్రతిభను చాటాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య అన్నారు.బుధవారం హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ వెనకబడిన తరగతుల సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల, కళాశాలలో ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి మహాత్మా జ్యోతిబాఫూలే పాఠశాలల
అండర్ -17 బాలికల క్రీడా పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు.

జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ముఖ్యఅతిథిగా హాజరై ముందుగా మహాత్మా జ్యోతిబా ఫూలే, సావిత్రిభాయి ఫూలేల చిత్రపటాలకి పూలమాలవేసి జ్యోతి ప్రజ్వలన చేశారు. క్రీడా పోటీల ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని జాతీయ జెండాను కలెక్టర్ ఆవిష్కరించారు. అనంతరం కలెక్టర్ క్రీడాజ్యోతిని వెలిగించి జిల్లాస్థాయి క్రీడా పోటీలను లాంఛనంగా ప్రారంభించారు.

ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మహాత్మా జ్యోతిబా ఫూలే గురుకుల పాఠశాలలకు చెందిన క్రీడాకారిణులు మార్చ్ పాస్ట్ ను నిర్వహించారు.
క్రీడాకారిణులతో క్రీడా స్ఫూర్తిని కొనసాగించాలని కలెక్టర్ ప్రతిజ్ఞ చేయించారు.

జిల్లా స్థాయి క్రీడా పోటీలను ప్రారంభించిన అనంతరం కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 18 పాఠశాలలకు చెందిన 600కు పైగా మంది విద్యార్థినులు పాల్గొనడం చాలా సంతోషకరమని పేర్కొన్నారు. కమలాపూర్ పాఠశాలలో మూడు రోజుల పాటు జిల్లా స్థాయి క్రీడా పోటీలు పెద్ద ఎత్తున నిర్వహిస్తుండడం అభినందనీయమని తెలిపారు. వివిధ క్రీడాంశాలలో బాలికలు ఉత్సాహంగా పాల్గొనాలని అన్నారు. క్రీడల్లో బాలికలు క్రీడా స్ఫూర్తిని చాటాలని పేర్కొన్నారు. గత నెలలో ఇదే పాఠశాలలో హాస్టల్ నిద్ర చేసినప్పుడు విద్యార్థినులు ఉత్సాహంగా క్రీడల్లో పాల్గొనడం తాను గమనించానని పేర్కొన్నారు. అంతర్జాతీయ స్థాయిలో పేరుతెచ్చుకున్న నిఖత్ జరీన్, దీప్తి జీవంజీలను బాలికలు ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కల్లెడ కు చెందిన దీప్తి జీవంజి పారా ఒలింపిక్స్ పోటీలో పతకం సాధించి దేశానికి కీర్తి ప్రతిష్టలను తీసుకువచ్చారని అన్నారు. బాక్సింగ్ లో నిఖత్ జరీన్, అథ్లెటిక్స్లో దీప్తి జీవంజీ లను బాలికలు ఆదర్శంగా తీసుకుని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అత్యుత్తమ ప్రతిభను చాటి దేశానికి కీర్తి ప్రతిష్టలను తీసుకురావాలన్నారు. నిఖత్ జరీన్ కు ప్రభుత్వం డీఎస్పీ ఉద్యోగం కల్పించిందన్నారు.

ఎక్కువమంది బాలికలను క్రీడల్లో ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణించే విధంగా ప్రభుత్వం ప్రోత్సాహాన్ని ఇస్తుందన్నారు. స్పోర్ట్స్ కోటాలో విద్యలో అవకాశాలు పొందాలని, అదేవిధంగా ఉద్యోగాలు సాధించాలని అన్నారు. బాలికలు చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలన్నారు. క్రీడల్లో పాల్గొనడం ద్వారా నాయకత్వ లక్షణాలు అలవడతాయని, క్రమశిక్షణ కలిగి ఉంటారన్నారు. క్రీడల్లో సాధించిన ప్రతిభ జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోతుందన్నారు. జిల్లా స్థాయిలో నిర్వహిస్తున్న క్రీడా పోటీల్లో విద్యార్థినులు ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయిలోనూ అత్యుత్తమంగా రాణించాలని కలెక్టర్ ఆకాంక్షించారు. క్రీడా పోటీల్లో పాల్గొంటున్న క్రీడాకారిణులకు శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా జిల్లా బీసీ వెల్ఫేర్ డిడి రామ్ రెడ్డి మాట్లాడుతూ క్రీడల్లో గెలుపు, ఓటములు సహజమని అన్నారు. క్రీడల్లో ప్రతిభను చాటాలని ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా వరంగల్ పాఠశాలకు చెందిన విద్యార్థినులు యోగాసనాలను అద్భుతంగా ప్రదర్శించి ఆకట్టుకున్నారు. వర్ధన్నపేట, తిమ్మాపూర్, గాంధీనగర్ పాఠశాలల విద్యార్ధినులు చేసిన నృత్యాలు అలరించాయి.

ఈ కార్యక్రమంలో కమలాపూర్ తహసీల్దార్ సురేష్ కుమార్, ఎంపీడీవో గుండె బాబు, మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలల జిల్లా కన్వీనర్ వెంకట ప్రసాద్, కమలాపూర్ పాఠశాల ప్రిన్సిపల్ సౌజన్య, ఇతర పాఠశాలల ప్రిన్సిపాల్స్ ఓదెల మల్లయ్య, తదితరులతో పాటు ఉపాధ్యాయులు, ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన మహాత్మా జ్యోతిబా ఫూలే గురుకుల పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular