ఓరుగల్లు9నేషనల్ టివి ప్రతినిధి: జమ్మూలో ఘోర ప్రమాదం జరిగింది. యాత్రికులు ప్రయాణిస్తున్న బస్సు అదుపు తప్పి దాదాపు 150 అడుగుల లోయలో పడింది. ఈ ప్రమాదంలో 16 మంది మృతి చెందగా.. 25 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు..
పోలీసుల కథనం ప్రకారం.. యాత్రికులతో నిండిన బస్సు యూపీలోని హత్రాస్ నుంచి జమ్మూ కాశ్మీర్‌లోని శివ్ ఖోడికి వెళుతోంది. చోకి చోరా ప్రాంతంలోని తంగ్లీ మలుపు వద్ద ఈ ప్రమాదం జరగ్గా.. బస్సు 150 అడుగుల లోయలో పడింది. అయితే బస్సుకు ఎదురుగా ఏదైనా వాహనం వచ్చిందా లేదా మరేదైనా కారణం ఉందా అనేది ఇంకా తెలియరాలేదు.
రాజౌరి జిల్లాలో ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు స్థానిక ప్రజల సహాయంతో రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. క్షతగాత్రులను జమ్మూలోని అఖ్నూర్ ఆసుపత్రి, ప్రభుత్వ వైద్య కళాశాల (జీఎంసీ)కి తరలించినట్లు అధికారులు తెలిపారు. కాగా.. ప్రమాదం తర్వాత ఘటనా స్థలంలో గందరగోళం నెలకొంది. బస్సు ఒక్కసారిగా లోయలో పడటంతో ప్రయాణికులు కేకలు వేశారు. దీంతో చుట్టు పక్కల ప్రజలు గమనించి ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వెంటనే క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై భారత రాష్ట్రపతి ద్రౌపదిముర్ము ట్వీట్ చేస్తూ చేశారు. ” జమ్మూ సమీపంలోని అఖ్నూర్‌లో జరిగిన బస్సు ప్రమాదంలో ప్రాణనష్టం గురించి తెలుసుకోవడం చాలా బాధ కలిగించింది. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను.” అని రాసుకొచ్చారు