కొచ్చిన్ యూనివర్శిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (కుశాట్)లో కేరళలోని కొచ్చిలో సంగీత కార్యక్రమం సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో నలుగురు విద్యార్థులు మరణించారు. పలువురు గాయపడ్డారని ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ తెలిపారు. క్యాంపస్‌లోని ఓపెన్ ఎయిర్ ఆడిటోరియంలో నిఖితా గాంధీ సంగీత కచేరీ జరుగుతుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతుల్లో యూనివర్సిటీకి చెందిన ఇద్దరు విద్యార్థులు, ఇద్దరు విద్యార్థినులు ఉన్నారు. కాగా, ఈ ప్రమాదంలో 60 మందికి పైగా విద్యార్థులు గాయపడ్డారని సమాచారం.
పలువురు విద్యార్థులు కలమసేరి మెడికల్ కాలేజీలో చికిత్స పొందుతున్నారని, మరికొందరు ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు సమాచారం అందిందని ఆరోగ్య మంత్రి తెలిపారు. నవంబర్ 25న సాయంత్రం 6 గంటలకు జరగాల్సిన కచేరీ అరగంట ఆలస్యం కావడంతో ఓపెన్ ఆడిటోరియం పూర్తిగా నిండిపోయింది. భారీ వర్షం కారణంగా జనం పరుగులు తీయడంతో తొక్కిసలాట జరిగింది. నలుగురు విద్యార్థుల మృతిని అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఏడీజీపీ) ఎంఆర్ అజిత్ కుమార్ ధృవీకరించారు. ఆకస్మిక వర్షం కారణంగా చాలా మంది లోపలికి ప్రవేశించడానికి ప్రయత్నించి, మెట్లపై పడిపోయారని చెప్పారు. ఈ ఘటనలో నలుగురిని ఆసుపత్రికి తీసుకురాగా, మరో నలుగురు పరిస్థితి తీవ్రంగా ఉందని.. అది కాకుండా, మెడికల్ కాలేజీలో మొత్తం 46 మంది గాయపడ్డారన్నారు.
టెక్ ఫెస్ట్‌లో భాగంగా, సంగీత కార్యక్రమం కూడా నిర్వహించారని, ఈ ఈవెంట్ కు జనం విపరీతంగా వచ్చారని, అప్పుడే వర్షం కురిసిందని వైస్ ఛాన్సలర్, డాక్టర్ శంకరన్ చెప్పారు. చాలా మంది ఒకేసారి లోపలికి రావడంతో మెట్టమీద పడిపోయారని, కొంత మంది విద్యార్థులు ఈ ఘటనలో గాయపడ్డారన్నారు. ఈ ఈవెంట్ కు 2వేల మంది కంటే ఎక్కువ మంది హాజరయ్యారని ఆయన అంచనా వేశారు.