ఆర్థిక లావాదేవీలు చేసేటప్పుడు స్క్రీన్ షేరింగ్ యాప్‌లను ఉపయోగించవద్దని గూగుల్‌పే కోరింది. వీటి సాయంతో మోసగాళ్లు మన బ్యాంకు ఖాతాలోనే డబ్బును దోచేసే ప్రమాదం ఉందని హెచ్చరించింది. రియల్ టైమ్‌లో ఇలాంటి అనుమానాస్పద లావాదేవీలను గుర్తించడానికి అధునాతన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మోసాల నివారణ టెక్నాలజీలను ఉపయోగిస్తున్నామని తెలిపింది. పటిష్టమైన భద్రతా చర్యలను అభివృద్ధి చేయడానికి పరిశ్రమ భాగస్వాములతో సహకరిస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది. అయినప్పటికీ స్కామర్లు వినియోగదారులను మోసగించేందుకు ప్రయత్నించవచ్చని హెచ్చరించింది. గూగుల్‌పే రెండు లేయర్లు రక్షణను అందిస్తుంది. అప్లికేషన్‌ను అన్‌లాక్ చేయడం మొదటిది కాగా, రెండోది లావాదేవీలను పూర్తి చేయడానికి యూపీఐ పిన్ వాడటం. మొదటి దశ పేమెంట్ అప్లికేషన్ సురక్షితంగా ఉందని నిర్ధారిస్తుంది. రెండవ దశ గోప్యమైన యూపీఐ పిన్‌ను కలిగి ఉంటుంది. ఇది ఏటీఎం పిన్‌ను భద్రపరిచేలా ఉంటుంది. ఇట్లాంటి పటిష్ట భద్రతా చర్యలు అమలులో ఉన్నప్పటికీ, స్క్రీన్‌షేరింగ్ యాప్స్‌తో సమస్యలు రావొచ్చని గూగుల్ స్పష్టం చేసింది.
ఇటువంటి కార్యకలాపాల నుంచి సురక్షితంగా ఉండటానికి, గూగుల్‌పే వినియోగదారులు అనుసరించాల్సిన మార్గదర్శకాలను వివరించింది. మీ గూగుల్‌పే ఖాతాకు లాగిన్ అయ్యేటప్పుడు వచ్చే ఓటీపీ వంటి వ్యక్తిగత సమాచారాన్ని రక్షించడం చాలా ముఖ్యం. దానిని ఎవరికీ చెప్పకూడదు. ఫోన్ కాల్ సమయంలో, పరధ్యానంలో ఉన్నప్పుడు, ఒత్తిడిలో ఉన్నప్పుడు ఆర్థిక లావాదేవీలను నిర్వహించడం మానుకోవాలి. సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌లలో సున్నితమైన వ్యక్తిగత వివరాలను పంచుకోవద్దని హెచ్చరించింది. లావాదేవీల సమయంలో స్క్రీన్ షేరింగ్ యాప్‌లను ఉపయోగించకూడదు. స్క్రీన్ షేరింగ్ యాప్‌లు వినియోగదారులు తమ డివైజ్ స్క్రీన్‌లను రియల్ టైం ఇతరులతో షేర్ చేసుకోవడానికి అనుమతిస్తాయి. ఈ యాప్‌లు ఒక యూజర్ స్క్రీన్‌ని మరొకరితో పంచుకోవడానికి వీలు కల్పిస్తాయి. షేర్ చేసిన స్క్రీన్‌ను రిమోట్‌గా చూడవచ్చు. కంట్రోల్ చేయవచ్చు. నిజానికి ట్రబుల్ షూటింగ్ లేదా రిమోట్ సహాయం వంటి పనుల కోసం ఈ యాప్‌లను వాడాల్సి ఉండగా, స్కామర్లు మోసాల కోసం వీటిని ఉపయోగిస్తున్నారు. గూగుల్‌పే వంటి ప్లాట్‌ఫారమ్‌లలో ఫోన్‌ను ఉపయోగించినప్పుడు మోసాలు జరిగే అవకాశాలు ఉంటాయి. ఓటీపీ వంటి సున్నితమైన సమాచారం ఇతరుల చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉంటుంది. లావాదేవీ సమయంలో స్క్రీన్ షేరింగ్ యాప్‌లను ఉపయోగించి పాస్‌వర్డ్‌లు, పిన్‌లు లేదా ఇతర వ్యక్తిగత సమాచారం వంటి రహస్య వివరాలను వేరే వాళ్లకు పంపవచ్చని గూగుల్ పే సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఒకరు చెప్పారు.