ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజల్ని మోసగించిన బీఆర్ఎస్ కు ఈ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని నర్సాపూర్ కాంగ్రెస్ అభ్యర్థి ఆవుల రాజిరెడ్డి అన్నారు. బుధవారం కౌడిపల్లి మండలంలోని పలు గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా రాజిరెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ అభ్యర్థి సునీతా రెడ్డిని నమ్ముకున్న ఎంతోమంది కార్యకర్తలను నట్టేట ముంచి మరో పార్టీలోకి వెళ్లారన్నారు.స్వార్థం కోసం పార్టీలు మారే లీడర్లను ఎట్టి పరిస్థితుల్లో నమ్మొద్దన్నారు. ఈ ఎన్నికలు పేదోడి జీవితం మార్చే ఎన్నికలని, పేదల బతుకులు కాంగ్రెస్ తో మారుతాయని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటే పేదల ప్రభుత్వం అని గతంలో అధికారంలో ఉన్పపుడు పేదలు కోసం ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకువచ్చి అమలు చేసిన ఘనత కాంగ్రెస్ కు ఉందన్నారు. లంబాడీల అభివృద్ధికి కాంగ్రెస్ అండగా ఉండి ఇచ్చిన హామీలు నెరవేరుస్తుందన్నారు.
కౌడిపల్లి మండలం రాజిపేట గ్రామంలో బీఆర్ఎస్ వార్డ్ మెంబర్ బాంచ శ్రీనివాస్, జాజి తండాలో గేమియా నాయక్, పీఏసీఎస్ డైరెక్టర్ బాల్ సింగ్, బీఆర్ఎస్ నాయకులు , కార్యకర్తలు 150 మంది కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధికార ప్రతినిధి ఆంజనేయులు గౌడ్, రాష్ట్ర నాయకురాలు సుహాసిని రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు శ్రీనివాసరావు ఉన్నారు.అలాగే చిలప్ చెడ్ మండలం ఫైజాబాద్ గ్రామానికి చెందిన 30 మంది కాంగ్రెస్ రాష్ట్ర నాయకురాలు సుహాసిని రెడ్డి, పార్టీ అధ్యక్షుడు నారాయణరెడ్డి ఆధ్వర్యంలో పార్టీలోచేరారు.