ఓరుగల్లు9నేషనల్ టీవీ :పాలమూరును పసిడి పంటల జిల్లాగా మార్చాల్సి ఉందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. 2023, అక్టోబర్ 31వ తేదీ మంగళవారం సాయంత్రం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కొల్లాపూర్ లో ఏర్పాటు చేసిన పాలమూరు ప్రజాభేరి సభలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ సభకు ప్రియాంక గాంధీ రావాల్సిందని.. కానీ, ఆమె ఆరోగ్యం బాగా లేకపోవడంతో రాలేకపోయారని చెప్పారు.చివరి నిమిషంలో ప్రియాంక గాంధీ టూర్ రద్దు అయితే.. తెలంగాణ ప్రజలను తమ కుటుంబంగా భావించి కొల్లాపూర్ సభలో పాల్గొనేందుకు.. రాహుల్ గాంధీ హుటాహుటినా ఢిల్లీ నుంచి హైదరాబాద్ ఎయిర్ పోర్టులో దిగారని చెప్పారు.
అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో కోల్లాపూర్ చేరుకునేందుకు పరిస్థితులు సరిగా లేవని.. కొల్లాపూర్ లో చాపర్ ల్యాండింగ్ చేసే సమయంలో ప్రమాదం ఉందని, ఏదైనా జరగొచ్చని పైలట్ తెలిపినా.. అత్యంత రిస్క్ తీసుకుని రాహుల్ గాంధీ మన కోసం ఇక్కడికి వచ్చారని తెలిపారు.
60 ఏళ్ల ఆకాంక్ష మేరకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని.. వaచ్చిన తెలంగాణలో కల్వకుంట్ల కుటుంబం బాగుపడింది తప్పా.. ప్రజలకు ఒరిగిందేమి లేదన్నారు. కేసీఆర్ కుటుంబం రూ.లక్ష కోట్లు దోపిడీ చేసిందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. మూడోసారి తనను సిఎం చేయాలని కేసీఆర్ తిరుగుతున్నారని… మళ్లీ సీఎం అయితే మరో రూ.లక్ష కోట్లను కేసీఆర్ కుటుంబం దోచుకుంటుందని అన్నారు. పదేళ్లైనా పాలమూరు, కల్వకుర్తి, బీమా, నెట్టెంపాడు ప్రాజెక్టులు పూర్తి కాలేదని విమర్శించారు. కేసీఆర్ పాలనలో పాలమూరులో వలసులు ఆగలేదు.. ఆత్మహత్యలు నివారించలేదని మండిపడ్డారు.