ఓరుగల్లు9నేషనల్ టీవీ :తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల హడావిడి మొదలైంది. ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేయడంతో అధికార ప్రతిపక్ష పార్టీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఒకరిని మించి ఒకరు పదునైన వాగ్బాణాలను సంధిస్తూ రాజకీయాలను రసవత్తరంగా మారుస్తున్నారు. డిసెంబర్ 3న తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ఒక విధానం ప్రకారం అభ్యర్థులను ఎంపిక చేస్తామన్నారు. కాంగ్రెస్ తో కలిసొచ్చే పార్టీలతో పొత్తు విషయంలో ఇంకా చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ్కి సేవ చేసిన వారికి సముచిత గౌరవం ఇస్తామంటూ… ఇప్పుడు ఎమ్మెల్యే టికెట్లు మాత్రమే ప్రకటిస్తున్నాం… ఇంకా అనేక పదవులు, అవకాశాలుంటాయన్నారు. పార్టీకి పనిచేసిన వారిని గుర్తించి సూచనలు ఇచ్చేందుకు జానారెడ్డి, థాక్రే, మున్షీ, మీనాక్షి నటరాజన్ ఆధ్వర్యంలో ఒక కమిటీ వేస్తున్నామన్నారు.
తెలంగాణలో డీజీపీగా ఏపీ క్యాడర్ అధికారులు స్టీఫెన్ రవీంద్ర, ప్రభాకర్ రావు లాంటి వారు ఒకే పదవిలో చాలా సంవత్సరాలుగా ఉన్నారని రేవంత్ రెడ్డి అన్నారు. కొంతమంది పోలీస్ ఉన్నతాధికారులు అధికార పార్టీకి అనుకూలంగా అత్యుత్సాహంగా పనిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి వచ్చిన తరువాత బీఆర్ఎస్ కు అనుకూలంగా పనిచేసిన అధికారులను వదలిపెట్టమన్నారు. ప్రభుత్వానికి తొత్తులుగా వ్యవహరిస్తున్న అధికారులను నియంత్రించేందుకు ఒక కమిటీని నియమించామని రేవంత్ రెడ్డి తెలిపారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ అధికారులకు సంబందించిన పలు కీలక అంశాలను పీఏసీ లో చర్చించారు తప్పుడు వార్తలు ప్రచురిస్తున్న ప్రసార మాధ్యమాల యాజమాన్యాలపై క్రిమినల్ కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. పార్టీలకు అనుకూలంగా రాస్తున్న వార్తలను పెయిడ్ న్యూస్ గా పరిగణించాలని డిమాండ్ చేశారు.