పసుపు బోర్డును ఎక్కడ ఏర్పాటు చేయాలో తమకు తెలుసునని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. ఇవాళ ఘట్ కేసర్ లో జరుగుతున్న రాష్ట్ర కౌన్సిల్ సమావేశాల్లో ఆయన మాట్లాడారు. పసుపు బోర్డుపై రేవంత్ రెడ్డికి అవగాహన లేదన్నారు. రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు మంత్రిగా పనిచేయలేదని, ఆయన జీవితంలో మంత్రి కాలేరని ఎద్దేవా చేశారు. పసుపు బోర్డు కోసం రేవంత్ రెడ్డి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
పసుపు పంటను నాశనం చేసిందే కాంగ్రెస్ పార్టీ అంటూ ధ్వజమెత్తారు. చెరుకును కనుమరుగు చేసింది టీడీపీ ప్రభుత్వమేనన్నారు. కొడంగల్ లో తంతే మల్కాజ్ గిరిలో పడ్డ రేవంత్ తమకు చెప్పడమేమిటని ప్రశ్నించారు. మంత్రి కేటీఆర్ మత్తు పదార్థాలు వాడటం మానుకోవాలన్నారు. కేసీఆర్ ఫ్యామిలీతో తెలంగాణకు నయాపైసా మేలుజరగదని చెప్పారు. కేంద్రం నిధులతోనే తెలంగాణ అభివృద్ధి చెందిందని వివరించారు. ఇప్పటికీ రెండు సార్లు మ్యానిఫెస్టో ప్రకటించిన బీఆర్ఎస్ వాటిని నెరవేర్చలేదని, మళ్లీ కేసీఆర్ మ్యానిఫెస్టో ప్రకటిస్తే దానిని తాను చించేస్తానని, మీరు కూడా చించేయాలంటూ నాయకులకు పిలుపునిచ్చారు.