ఓరుగల్లు9నేషనల్ టీవీ ప్రతినిధి ఖమ్మం: ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారికి ఎన్టీఆర్ ఆరాధ్య దైవమని తెలంగాణ మంత్రి కేటీఆర్ కొనియాడారు. ఖమ్మంలోని లకారం ట్యాంక్ బండ్‌పై రూ.1.37 కోట్లతో నూతనంగా ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ పార్క్ సహా విగ్రహాన్ని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌తో కలిసి కేటీఆర్ ఆవిష్కరించారు..
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.”ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ ఎంతో ఆప్తుడు విశ్వ విఖ్యాత నందమూరి తారక రామారావు. ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేసిన మహా నాయకుడు ఎన్టీఆర్. రాముడు ఎలా ఉంటాడో తెలియదు.. కృష్ణుడు ఎలా ఉంటాడో తెలియదు.. మాకు రాముడైనా, కృష్ణుడైనా ఆయనే. భారత దేశంలో తెలుగు వారంటూ ఉన్నారని గుర్తించేలా చేసింది ఎన్టీఆరే. చరిత్రలో మహనీయుల స్థానం ఎప్పటికీ చిరస్మరణీయంగా ఉంటుంది. ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించే అవకాశం రావడం నా అదృష్టం. నాకు తారక రామారావు పేరు ఉండటం చాలా సంతోషంగా ఉంది. తారక రామారావు పేరులోనే పవర్ ఉంది. ఎన్టీఆర్ శిష్యుడిగా కేసీఆర్ తెలంగాణ అస్తిత్వాన్ని దేశవ్యాప్తంగా చాటి చెప్పారు. దక్షిణ భారత దేశంలో అన్న ఎన్టీఆర్ సహా ఇప్పటివరకూ హ్యాట్రిక్ ఎవరూ కొట్టలేదు. అది సీఎం కేసీఆర్‌కు త్వరలో సాధ్యమవుతుంది” అని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు.