ఓరుగల్లు9నేషనల్ టీవీ ప్రతినిధి:ఖమ్మం జిల్లాలో మంత్రుల టూర్ నేపథ్యంలో కాంగ్రెస్, వామపక్ష నేతలను ముందస్తుగా అరెస్ట్ చేశారు పోలీసులు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఖమ్మం, వైరా, భద్రాచలం, సత్తుపల్లి నియోజక వర్గాల్లో శనివారం( సెప్టెంబర్ 30) రాష్ట్ర మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ లు పర్యటించి పలు అభివృద్ది కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. పర్యటన సందర్భంగా మంత్రులను అడ్డుకునేందుకు యత్నించే అవకాశం ఉందని ముందస్తుగానే ప్రతిపక్ష నేతలు, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ శనివారం ఖమ్మం సిటీలో పర్యటించనున్నారు. మంత్రి పువ్వాడ అజయ్ తో కలిసి రూ.1,369.36 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ప్రధానంగా మున్నేరు నదికి రెండు వైపులా రూ.690 కోట్లతో నిర్మించనున్న ఆర్సీసీ ప్రొటెక్షన్ వాల్ కు, మున్నేరు నదిపై రూ.180 కోట్లతో నిర్మించనున్న కేబుల్బ్రిడ్జికి శంకుస్థాపన చేయనున్నారు.