ఓరుగల్లు9న్యూస్ ప్రతినిధి:- దేశంలో ఏ సీఎం కూడా వారానికోసారి ఢిల్లీ వెళ్లినట్టు చరిత్రలో లేదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. రేవంత్ రెడ్డి హస్తినలో అటెండెన్స్ వేసుకుంటున్నారని ఆరోపించారు. రాహుల్ డైరెక్షన్ లోనే రేవంత్ ప్రధానిపై విమర్శలు చేస్తున్నారన్నారు.
టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా వరంగల్లో మాట్లాడిన కిషన్ రెడ్డి.. బీఆర్ఎస్ ను గద్దె దించేందుకు ప్రజలకు పదేండ్లు పట్టింది. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై 12 నెలల్లోనే వ్యతిరేకత స్టార్ట్ అయ్యిందన్నారు. కాంగ్రెస్ పార్టీ వంద రోజుల్లో 6 గ్యారెంటీలు అమలుచేస్తామని చెప్పి చేయలేదన్నారు
రాష్ట్రంలో గత ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాల భర్తీ తప్ప.. పార్టీ ఇచ్చిన కొత్త ఉద్యోగాలేమి లేవన్నారు. ప్రజా వ్యతిరేకతను మరల్చేందుకు లేని విషయాలను సీఎం మాట్లాడుతున్నారని విమర్శించారు. ఘాటుగా, ఆవేశంగా మాట్లాడితే ప్రజలు ఎక్కువ రోజులు భరించరని సూచించారు. అందినకాడికి అప్పులు చేసి, రాష్ట్రాన్ని దివాళా తీసే పరిస్థితిలో ప్రభుత్వం ఉందన్నారు.
భూములు అమ్మడం, సొమ్ము చేసుకోవడమే లక్ష్యంగా రేవంత్ సర్కార్ పనిచేస్తోందని ఆరోపించారు. వనరులు సమకూర్చుకునే అంశంలో ప్రణాళిక లేదు.. ఇచ్చిన హామీలు అమలుచేసేందుకు రోడ్డు మ్యాప్ కూడా లేదని ఎద్దేవా చేశారు. గుడ్డెద్దు చేనులో పడ్డట్లు కాంగ్రెస్ పరిపాలన ఉందని సెటైర్లు వేశారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ కు గడ్డు కాలమే..బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు పార్టీలు దొందూ దొందే అని మండిపడ్డారు