నర్సాపూర్ జి, జూలై 18: ఓరుగల్లు9 నేషనల్ టీవీ, నిర్మల్ జిల్లా
నర్సాపూర్, తెలంగాణ: గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGS) పనుల పరిశీలన కోసం నర్సాపూర్ జి, తిమ్మాపూర్‌లో పర్యటించిన కేంద్ర బృందం శుక్రవారం సంతృప్తి వ్యక్తం చేసినప్పటికీ, స్థానికుల నుండి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బృందం గ్రామసభలు నిర్వహించి నిధుల వినియోగంపై వివరించిందని, నర్సరీ, పశువుల పాకలు, ఇంకుడు గుంతలు, ఆయిల్ పామ్ పెంపకం, అటవీ పనుల నాణ్యతను ప్రశంసించిందని అధికారికంగా ప్రకటించబడింది. కేంద్ర బృందంలో నారాయణరెడ్డి, శ్రీనివాస్, రెడ్డి సిబ్బందితో పాటు డిఆర్‌డిఓ ఏవో శ్రీనివాస్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
అయితే, ఈ ప్రశంసల వెనుక క్షేత్రస్థాయిలో ఉన్న లోపాలు, అధికారుల నిర్లక్ష్యం బయటపడింది. నర్సాపూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో మూడేళ్ల క్రితం ఏర్పాటు చేసిన ఒక ఇంకుడు గుంత రెండేళ్లుగా చెడిపోయిందని, ఇప్పటివరకు అధికారులు మరమ్మతులు చేయలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. కేంద్ర బృందం పర్యటనలో భాగంగా శుక్రవారం నర్సాపూర్ మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించినప్పుడు, చెడిపోయిన ఇంకుడు గుంతలు కనిపించలేదా అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఇది అధికారుల పర్యవేక్షణ లోపానికి, వాస్తవాలను దాచిపెట్టడానికి నిదర్శనమని వారు విమర్శిస్తున్నారు.
గ్రామసభల నిర్వహణపైనా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. గ్రామసభలు ఏర్పాటు చేస్తున్నామని ఒక రోజు ముందు కూడా సమాచారం ఇవ్వకుండా డ్వాక్రా మహిళలను మాత్రమే పిలిచి సమావేశాలు నిర్వహిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ పథకాలు తమకు అందుతున్నాయా లేదా అని అడగడానికి వచ్చిన కేంద్ర బృంద సభ్యులకు తాము ముందుగా సమాచారం ఇస్తే గ్రామాలలో అందుబాటులో ఉంటామని, అప్పుడు అసలు విషయాలు తెలియజేయగలమని వారు పేర్కొంటున్నారు. ఇది కేంద్ర బృందం వాస్తవ పరిస్థితులను తెలుసుకోకుండా, తూతూమంత్రంగా పర్యటనలు నిర్వహిస్తుందనే అనుమానాలకు తావిస్తోంది.

గత మూడు సంవత్సరాల నుంచి మరమ్మత్తులు నోచుకుని ఇంకుడు గుంత