ఓరుగల్లు9నేషనల్ టీవీ :రాజ్ భవన్ వేదికగా కాంగ్రెస్, బీజేపీ ఒక్కటే అన్న కేటీఆర్ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి స్పందించారు. కేటీఆర్ పైన తాము ఎందుకు కుట్ర చేస్తామని, తమకు అవసరం కూడా లేదని ఆయన చెప్పారు. బీజేపీ గురించి కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారని, అంటే బీజేపీ పేరు ఎత్తకుండా వారికి మాట్లాడటానికి ఏ అంశాలు లేవని ఎద్దేవా చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్వి బరితెగింపు మాటలని, తన డీఎన్ఎ పొన్నం అడిగారని, తన డీఎన్ఎ తెలంగాణ ప్రజలకు తెలుసని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు.కులగణన చేయడాన్ని బీజేపీ స్వాగతిస్తుందని, బీసీలకు ఇస్తామన్న 42 శాతం రిజర్వేషన్లు కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
మూసీ ప్రక్షాళనను స్వాగతిస్తున్నామని, కానీ మూసీ ప్రక్షాళన పేరుతో రియల్ ఎస్టేట్ దందా చేస్తామంటే ఊరుకోమని హెచ్చరించారు. సీఎం మూసీ పాదయాత్ర చేయాలని, నల్లగొండ ప్రజలకు మంచి నీళ్ళు ఇవ్వాలని కిషన్ రెడ్డి సూచించారు. మూసీలో ప్రక్షాళన చేసి ‘‘కృష్ణ నీళ్ళు తెస్తారా..? గోదావరి నీళ్ళు తెస్తారా.. ఏవైనా తెచ్చిపొయ్యాలి’’ అని ప్రభుత్వాన్ని కోరారు.బీజేపీలో ఎమ్మెల్సీ టికెట్ అభ్యర్థులు ఎక్కువ ఉన్నారని, గెలిచే అభ్యర్థులకు ఎమ్మెల్సీ టికెట్లు ఇస్తామని స్పష్టం చేశారు. సర్పంచ్ల కోసం బీఆర్ఎస్ ధర్నా చేయడం విడ్డురంగా ఉందని, సర్పంచ్లకు బిల్లులు ఇవ్వక పోగా.. కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోదీ ఇచ్చిన పైసలు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం వాడుకుందని కిషన్ రెడ్డి ఆరోపించారు. రైతులు నుంచి చివరి గింజ వరకు కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, మొత్తం డబ్బులు కేంద్ర ప్రభుత్వం ఇస్తుందని హామీ ఇచ్చారు. మహా రాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొంటామని, పెరుగుతున్న బీజేపీ బలం చూసి కాంగ్రెస్, బీఆర్ఎస్ పదేపదే తమను విమర్శిస్తున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు.