Friday, June 27, 2025

ఫ్యామిలీ డిజిటల్ కార్డు కోసం వివరాలు పక్కాగా సేకరించాలి : మంత్రి పొంగులేటి

ఓరుగల్లు9నేషనల్ టీవీ :ఫ్యామిలీ డిజిటల్ కార్డు కోసం వివరాలు పక్కాగా సేకరించాలని ఆయా జిల్లా కలెక్టర్లను రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు.ఫ్యామిలీ డిజిటల్ కార్డు, ఎల్ ఆర్ ఎస్ దరఖాస్తులు, రెండు పడక గదులు, కొనుగోలు కేంద్రాల ఏర్పాటు అంశాలపై ఆయా జిల్లాల కలెక్టర్లతో మంత్రి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారితో కలసి హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ మంగళవారం నిర్వహించగా, వరంగల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదా హాజరయ్యారు.ఫ్యామిలీ డిజిటల్ కార్డు అమలు తదితర అంశాలను ఐటీ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేష్ రంజన్ పవర్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం ఉన్నతాధికారులు రాజస్థాన్, మహారాష్ట్ర వంటి 5 రాష్ట్రాల్లో పర్యటించి, ఫ్యామిలీ డిజిటల్ కార్డు రూపకల్పన, వీటి వల్ల వచ్చే ఫలితాలపై నివేదిక అందించారని తెలిపారు.

ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 2 గ్రామ పంచాయతీలు లేదా 1 గ్రామ పంచాయతీ, 1 డివిజన్ తీసుకుని పైలెట్ విధానం ద్వారా ఫ్యామిలీ డిజిటల్ కార్డు అమలు చేయాలని అన్నారు. అక్టోబర్ 3న ఫ్యామిలీ డిజిటల్ కార్డు ముఖ్యమంత్రి ప్రారంభిస్తారని, అక్టోబర్ 8న సాయంత్రం నాటికి ఫైలెట్ మోడ్ లో వచ్చిన సమస్యలను నివేదిక అందించాలని అన్నారు.ఫ్యామిలీ డిజిటల్ కార్డ్ అమలులో వచ్చే లోపాలను సవరిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం అమలు చేస్తుందని అన్నారు. ప్రభుత్వం అమలు చేసే ప్రతి కార్యక్రమానికి ఈ కార్డు కీలకం అవుతుందని అన్నారు. ఫ్యామిలీ డిజిటల్ కార్డు పర్యవేక్షణకు ఉమ్మడి జిల్లాలకు ప్రత్యేక అధికారులను నియమించామని, డిజిటల్ కార్డులో వివరాల నమోదుకు సంబంధించి ఐటీ పరమైన అంశాల పర్యవేక్షణకు ప్రతి జిల్లాకు నిపుణులు కేటాయిస్తామని అన్నారు.

ఫ్యామిలీ డిజిటల్ కార్డు సర్వే వివరాలు ఎప్పటికప్పుడు కంప్యూటర్ లో నమోదు చేయాలని అన్నారు. ఫ్యామిలీ డిజిటల్ కార్డులో జారీలో ఎదురయ్యే ఇబ్బందులను పైలెట్ ప్రాజెక్టుల ద్వారా తెలుసుకొని వాటిని సవరించాలని అన్నారు.ఎల్.ఆర్.ఎస్ 2020 ఇప్పటికీ దరఖాస్తులను డిస్పోస్ చేయకపోవడానికి గల కారణాలను తెలియజేయాలని అన్నారు. ఎల్.ఆర్.ఎస్ దరఖాస్తులకు సంబంధించి అర్హులను మాత్రమే ఆమోదించాలని అన్నారు.జిహెచ్ఎంసి మినహా రాష్ట్ర వ్యాప్తంగా లబ్ధిదారులకు కేటాయించని డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు దసరా కంటే ముందు లబ్ధిదారులను ఫైనల్ చేయాలని మంత్రి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. జిల్లా ఇంఛార్జి మంత్రి చైర్మన్, కలెక్టర్ కన్వీనర్ గా కమిటీ ఏర్పాటు చేసుకొని లబ్ధిదారుల ఎంపిక జరగాలని అన్నారు.

ధాన్యం కొనుగోలుకు సంబంధించి సన్న వడ్ల కొనుగోలు సందర్భంగా ప్రభుత్వ మార్గదర్శకాలను పకడ్బందీగా పాటించాలని, ప్రస్తుతం కొనుగోలు చేస్తున్న సన్న వడ్లను బియ్యంగా మార్చి జనవరి మాసం నుంచి సన్న బియ్యం రేషన్ దుకాణాల ద్వారా సరఫరా చేస్తామని, నాణ్యత అంశంలో ఎక్కడా రాజీ పడవద్దని మంత్రి పేర్కొన్నారు. కుటుంబంలో ఉన్న మహిళ పేరు మీద ఫ్యామిలీ డిజిటల్ కార్డు జారీ చేయడం జరుగుతుందని అన్నారు. ఒక వ్యక్తి ఒకే కుటుంబంలో ఉండే విధంగా ఫ్యామిలీ కార్డుల రూపకల్పన ఉండాలని, రెండు కార్డులలో ఒకరి పేరు రావద్దని అన్నారు.

అక్టోబర్ 3 నుంచి అక్టోబర్ 8 వరకు ఫ్యామిలీ డిజిటల్ కార్డు వివరాలు సేకరణ పూర్తి కావాలని, దీనికి అనుగుణంగా గ్రామాలు, పట్టణ వార్డు లోని కుటుంబాల సంఖ్య ఆధారంగా అవసరమైన బృందాలను ఏర్పాటు చేసుకోవాలనీ సీఎస్ కలెక్టర్ లకు సూచించారు.పైలెట్ ప్రాజెక్టు క్రింద ఎంపిక చేసిన గ్రామాలు డివిజన్ నుంచి ప్రతి కుటుంబం వివరాలు సేకరించి వివరాల నమోదు చేయాలని అన్నారు. ఫ్యామిలీ డిజిటల్ కార్డు ప్రతి కుటుంబానికి రావాలని, ఆదాయ పరిమితి తో సంబంధం లేదని అన్నారు.రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ విస్తరణ, నూతన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీరూపకల్పనకు ప్రతిపాదనలు సమగ్ర సమాచారంతో అందించాలని సీఎస్ జిల్లా కలెక్టర్ లను ఆదేశించారు. అర్బన్ డెవలప్మెంట్ అథారిటీల్లో ఏజెన్సీ ఏరియాలను కలుప వద్దని అన్నారు.

ఎల్.ఆర్.ఎస్ పెండింగ్ దరఖాస్తులను ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకొని అర్హులైన లేఔట్ క్రమబద్ధీకరణ పూర్తి చేయాలని అన్నారు. లేఔట్ క్రమబద్ధీకరణ సమయంలో చెరువుల బఫర్ జోన్, ఎఫ్.టి.ఎల్ పరిధిలో ఉంటే క్రమబద్ధీకరణ చేయవద్దని, దీనికి సంబంధించి నీటి పారుదల శాఖ అధికారుల మద్దతు తీసుకోవాలని అన్నారు వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎస్.డి.ఆర్.ఎఫ్ మార్గదర్శకాల ప్రకారం మరమ్మత్తుకు గురైన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పాఠశాలలు, అంగన్వాడి కేంద్రాలు, కమ్యూనిటీ భవనాలు మొదలగు భవనాల వివరాలు పకడ్బందీగా అందజేయాలని, ఆ వివరాల ప్రకారం బడ్జెట్ విడుదల చేయడం జరుగుతుందని అన్నారు.వరద ప్రభావిత ప్రాంతాల్లో వెంటనే చర్యలు తీసుకునేందుకు విడుదల చేసిన నిధులను పరిహారం అందించేందుకు, అత్యవసర మరమ్మత్తు పనులు చేపట్టేందుకు, ప్రజా సంచార ప్రదేశాల్లో చెత్త తొలగింపుకు, త్రాగునీటి పైప్లైన్ పనుల పునరుద్ధరణ పనులకు వినియోగించాలని అన్నారు.

ప్రస్తుత ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ నుంచి సన్న వడ్లకు ప్రభుత్వం క్వింటాల్ కు 500 రూపాయల బోనస్ ప్రకటించిందని అన్నారు. సన్న వడ్ల కొనుగోలుకు క్వింటాల్ కు 500 రూపాయలు అధికంగా చెల్లించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.సన్న ధాన్యం, దొడ్డు ధాన్యం కొనుగోలు కోసం ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేయాలని అన్నారు. అక్టోబర్ 15 నాటికి పూర్తి స్థాయిలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి అవసరమైన మౌలిక వసతులను కల్పించాలని అన్నారు. సన్న వడ్ల గుర్తింపు ప్రభుత్వ మార్గదర్శకాలను తూచ తప్పకుండా పాటించాలని అన్నారు.

వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదా అధికారులతో మాట్లాడుతూ ఫ్యామిలీ డిజిటల్ కార్డు జారీ కోసం జిల్లాలో ప్రత్యేక అధికారులు పర్యవేక్షించాలని, అసెంబ్లీ నియోజకవర్గంలో కేటాయించిన బృందాలకు అవసరమైన అవగాహనను వెంటనే కల్పించాలని సూచించారు. ప్రతిరోజు ఇళ్ల లక్ష్యాలను కేటాయించి ఉదయం, సాయంత్రం వారి పనితీరు పర్యవేక్షించాలని, ఇంటింటికి తిరిగి ఆఫ్ లైన్ లో పూర్తి వివరాలు సేకరించి సర్వే చేపట్టాలని, దీనికి తగిన విధంగా అవసరమైన బృందాలను ఏర్పాటు చేసుకోవాలని కలెక్టర్ తెలిపారు.
ఎల్ ఆర్ ఎస్ దరఖాస్తులు త్వరిత్తగతిన పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.ఈ వీడియో కాన్పరెన్సు లో అదనపు కలెక్టర్ సంధ్యారాణి , ఆర్డీవో కృష్ణవేణి, జైజెడ్పి సీఈఓ రామిరెడ్డి, సంబంధిత శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గోన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular