ఓరుగల్లు9నేషనల్ టీవీ :సింగిల్ స్క్రీన్ థియేటర్ల యజమానులు నిర్మాతలకు డెడ్ లైన్ విధించారు. ఇతర రాష్ట్రాలు, దేశాల తరహాలోనే టాలీవుడ్‌లో కూడా ఎగ్జిబిటర్లకు పర్సంటేజీలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇకపై అద్దె ప్రాతిపదికన సినిమాలు ప్రదర్శించబోమని తేల్చి చెప్పారు. ఇవాళ హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సంఘం అధ్యక్షుడు విజయేందర్ రెడ్డి మాట్లాడారు. మల్టీఫ్లెక్స్ తరహాలోనే నిర్మాతలు పర్సంటెజీలు చెల్లిస్తేనే సినిమాలను ప్రదర్శిస్తామని, లేదంటే థియేటర్ల మూత తప్పదని హెచ్చరించారు. నిర్మాతలు పర్సంటేజీలు చెల్లించకపోతే సింగిల్ స్క్రీన్ థియేటర్ల మూత తప్పదన్నారు. రాష్ట్రంలో పదేళ్లలో 2 వేల సింగిల్ స్క్రీన్ థియేటర్లు మూసివేశారని చెప్పారు.
కొంత మంది డిస్టిబ్యూటర్లు సినిమా వ్యాపారాన్ని జూదంగా మార్చారని ఆవేదన వ్యక్తం చేశారు. బెనిఫిట్ షో లు, అదనపు ఆటలతో మోసాలకు పాల్పడుతున్నారన్నారు. ఇక నుంచి బెనిఫిట్ షోలు, అదనపు ఆటలు ప్రదర్శించబోమని కుండబద్దలు కొట్టారు. అన్ని సినిమాలను పర్సంటేజీ విధానంలోనే ఆడిస్తామని చెప్పారు. జులై 1 వరకు తెలుగు సినీ నిర్మాతలకు గడువు ఇస్తున్నామని, ఆ లోపు నిర్మాతలు ఓ మంచి నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నామని అన్నారు. కల్కీ, పుష్ప2, గేమ్ చేంజర్ , భారతీయుడు చిత్రాలను మాత్రం పాత పద్దతిలోనే ప్రదర్శిస్తామని వెల్లడించారు.