ఓరుగల్లు9నేషనల్ టీవీ :హైదరాబాద్‌ను వర్షం ముంచెత్తింది. గురువారం సాయంత్రం ఉరుములు మెరుపులతో రెండున్నర గంటల పాటు కుండపోత కురిసింది. భారీ వర్షానికి రోడ్లపై పెద్ద ఎత్తున వరద చేరి, ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అయింది. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లోనూ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. అత్యధికంగా నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండలో 9.8 సెంటీమీటర్లు, హైదరాబాద్ లోని కృష్ణానగర్‌లో 9.33 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. హైదరాబాద్ లో మధ్యాహ్నం 3 గంటల వరకు ఎండ మండిపోయింది. ఆ తర్వాత ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. అరగంట వ్యవధిలో మబ్బులు కమ్ముకుని ఉరుములు మెరుపులతో భారీ వర్షం కురిసింది. సాయంత్రం 6 గంటల వరకు దాదాపు రెండున్నర గంటల పాటు సిటీ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో వాన దంచికొట్టింది. దీంతో అటు కాలనీల్లో, ఇటు రోడ్లపైనా వరద చేరింది.
రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లోనూ గురువారం మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్, సూర్యాపేట జిల్లాల్లో పలు చోట్ల పెద్ద వానలు పడ్డాయి. జయశంకర్ భూపాలపల్లి, ఖమ్మం మినహా మిగతా అన్ని జిల్లాల్లోనూ వర్షాల ప్రభావం ఉంది. అత్యధికంగా నాగర్‌కర్నూల్‌జిల్లా వెల్దండలో 9.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సూర్యాపేట జిల్లా ఆత్మకూరులో 6.7, మహబూబ్‌నగర్‌లోని అడ్డకాల్లో 6.6, మెదక్‌లోని రామాయంపేటలో 5.8, నల్గొండలోని నాంపల్లిలో 5.4, వరంగల్ లోని గొర్రెకుంటలో 5.1, సిద్దిపేటలోని కొండపాకలో 5, నల్గొండలోని చింతపల్లిలో 4.8, జనగామలో 4.4, వరంగల్‌లోని కాశీబుగ్గలో 4.2, కరీంనగర్‌లోని నుస్తులాపూర్‌లో 3.8, నాగర్‌కర్నూల్‌లోని ఊర్కొండలో 3.7, వనపర్తిలోని సోలీపూర్‌లో 3.7, హనుమకొండలోని ఐనవోలులో 3.7, మెదక్ లోని మాసాయిపేటలో 3.6 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది.