ఓరుగల్లు9నేషనల్ టీవీ :ప్రధాని నరేంద్ర మోదీ పాలనలో దేశ ప్రతిష్ట దిగజారిందని బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ అన్నారు. బీజేపీకి ఈసారి 400 సీట్లు వస్తాయని అంటున్నారని, ఆ పార్టీకి 200 సీట్లు కూడా రావని ఆయన పేర్కొన్నారు. మంగళవారం కామారెడ్డి, మెదక్‌లో జరిగిన రోడ్‌షోలో ఆయన మాట్లాడారు. ‘‘బీజేపీ మళ్లీ గెలిస్తే.. పెట్రోల్, డీజిల్ రేటు లీటరుకు రూ.400 అయితది. అచ్ఛే దిన్ తెస్తానని మోదీ మాట ఇచ్చి దేశ ప్రజలు సచ్చే దిన్ తెచ్చాడు. ఆయన పాలనలో దేశ ఆర్థిక వ్యవస్థ దిగజారింది.
రూపాయి విలువ తగ్గింది. ఎగుమతులు బందయ్యాయి. దిగుమతులు పెరిగాయి. 150 హామీలు ఇచ్చిన మోదీ.. ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు” అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. కామారెడ్డి వాళ్లు బీజేపీ ఎమ్మెల్యేను గెలిపిస్తే జన్‌ధన్ ఖాతాలో రూ. 30 లక్షలు వచ్చినయట కదా అని ఆయన ఎద్దేవా చేశారు. ‘‘కృష్ణా, గోదావరి నదులను తమిళనాడుకు తరలించాలని మోదీ చూస్తున్నారు. బీజేపీకి ఓటు వేస్తే మన నదుల నీళ్లు పోతాయి. బీజేపీది దోపిడీదారులు, పెట్టుబడిదారుల పార్టీ. అది పేదల పార్టీ కాదు. మత విద్వేషాలు రెచ్చగొట్టి ప్రజల మధ్య చిచ్చుపెట్టడం తప్ప పేదల కోసం పనిచేయడం బీజేపీ నేతలకు తెల్వదు” అని కేసీఆర్ విమర్శించారు. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం వస్తుందని, బీఆర్ఎస్ అందులో కీలకంగా ఉంటుందన్నారు