ఓరుగల్లు9నేషనల్ టీవీ :అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించినట్టు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. రైతులకు ఇబ్బంది కలగకుండా సివిల్ సప్లయ్స్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డితో తాను మాట్లాడానని చెప్పారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. వర్షం కారణంగా మంగళవారం కరీంనగర్లో కాంగ్రెస్ సభ రద్దు కావడంతో సభా వేదిక వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘ప్రజాస్వామ్యం బతకాలంటే కాంగ్రెస్‌ను గెలిపించాలి. ఫస్ట్, సెకండ్ ఫేజ్ ఓటింగ్‌తోనే బీజేపీకి ఓటమి భయం పట్టుకున్నది.
అందుకే ప్రధాని మోదీ రెచ్చగొట్టేలా దిగజారి మాట్లాడుతున్నరు.తాళిబొట్టు అమ్మి నామినేషన్ వేసిన బండి సంజయ్‌కి వేల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చినయ్? దేవుడి పేరు చెప్పుకుని ఓట్లు అడుక్కునే సంజయ్.. కరీంనగర్‌లోని ఆలయాల కోసం ఏం చేశాడు?’’అని పొన్నం నిలదీశారు. స్మార్ట్ సిటీ పనుల్లో అవినీతి జరిగితే సంజయ్ ఎందుకు నోరు మెదపలేదో చెప్పాలన్నారు. సంజయ్ లాంటి మూర్ఖుడు ప్రజాస్వామ్యానికి పనికి రాడని విమర్శించారు. పొన్నం వెంట కరీంనగర్ లోక్‌సభ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు, సీపీఐ జాతీయ నాయకుడు చాడ వెంకట్ రెడ్డి, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం, మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు.