జోగులాంబ గద్వాల జిల్లా ఓరుగల్లు9నేషనల్ టీవీ ప్రతినిధి:- జోగులాంబ గద్వాల జిల్లాలోని గద్వాల నియోజకవర్గం, ధరూర్ మండల కేంద్రంలో ఉన్న పెద్ద వాగుపై బ్రిడ్జి నిర్మాణం చేపట్టేందుకు గత ప్రభుత్వం రూ. 3కోట్ల వ్యయంతో ఎన్నికలకు ముందు ఆగమేఘాల పనులను చేపట్టేందుకు పూనుకుంది. అప్పటి వరకు ఉన్న పాత బ్రిడ్జిని కూల్చి కొత్తగా నిర్మాణం చేపట్టేందుకు అధికారులు, పాలకులు చర్యలు తీసుకున్నారు. అయితే పనులు మొదలు పెట్టి వాటిని అసంపూర్తిగానే వదిలేశారు. అయితే ప్రజలు వెళ్లేందుకు ఎలాంటి ప్రత్యామ్నాయ మార్గం చూపకుండానే బ్రిడ్జిని కూల్చి వేయడంతో నీలహళ్లి, పాతపాలెం గ్రామస్తులు గద్వాల, రాయచూరు పట్టణాలకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉన్న కొద్దిపాటి ఇరుకు దారిలో ఎలాగోలా వెళ్లాలని ప్రయత్నిస్తే తీవ్ర ట్రాఫిక్ జాం అవడమే కాకుండా ఎంతోమంది కింద పడి గాయపడిన సంఘటనలు ఉన్నాయని గ్రామ పెద్దలు చిలుక మునెప్ప పేర్కొన్నారు. బ్రిడ్జి నిర్మాణంపై అధికారులను ప్రశ్నిస్తే ఆర్అండ్బి శాఖ, విద్యుత్ శాఖ మధ్య సమన్వయం లోపం వల్ల జాప్యం ఆలస్యం అవుతుందని చెబుతున్నారని వాపోయారు. ఎటువంటి ఆలోచన లేకుండా ప్రజలను ఇబ్బందుల పాలు చేసేలా బ్రిడ్జి నిర్మాణం పనులు చేపట్టడం దారుణమని అన్నారు. బ్రిడ్జి నిర్మాణంపై ఇటు మండల అధికారులు కానీ, ఎమ్మెల్యే కానీ సమస్య వైపు నేటికి తొంగి చూడకపోవడం సిగ్గుచేటన్నారు. నిత్యం రెండు గ్రామాల ప్రజలు పడుతున్న బాధలు వర్ణనాతీతం అని ఆవేదన వ్యక్తం చేశారు. బ్రిడ్జి నిర్మాణం పనులు చేపట్టి రెండు సంవత్సరాలు అవుతున్నా పూర్తి చేయడం లేదని, దీనిపై కాంట్రాక్టర్ ని గ్రామ పెద్దలు ప్రశ్నిస్తే బిల్లులు కాలేదు అందుకే నిలిపివేశామని చెప్పడం గమనార్హం. గత బీఆర్ఎస్ ప్రభుత్వం బిల్లులు ఇవ్వకుండా చేసిన నిర్లక్ష్యం…ఆర్అండ్బి అధికారుల ప్లాన్ లేకుండా పనులు ప్రారంభించడం వల్ల నీలహళ్లి, పాతపాలెం గ్రామస్తులు నేడు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపారు. ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అయిన స్పందించి బ్రిడ్జి నిర్మాణ పనులను పూర్తి చేయాలనీ, ఆ దిశగా జిల్లా పరిషత్ చైర్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇంచార్జి సరిత తిరుపతయ్య కృషి చేయాలని గ్రామస్తులు చిలుక మునెప్ప, వీరేష్, కృష్ణమూర్తి, ఆటో రఫీ, కావలి నాగరాజు, చాకలి విజేంద్ర, గురువు ఈరన్న, రాము, జగన్ తదితరులు కోరుతున్నారు. ఈ విషయంపై జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు త్వరగా స్పందించకపోతే గ్రామస్తులందరితో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని వారు హెచ్చరించారు.
అసంపూర్తి బ్రిడ్జి నిర్మాణాన్ని పట్టించుకోని అధికారులు-ఇబ్బందులు పడుతున్న నీలహళ్లి, పాతపాలెం గ్రామ ప్రజలు-అధికారులు త్వరగా స్పందించకపోతే ఆందోళనలు చేపడతాం…గ్రామస్తులు ఓరుగల్లు9నేషనల్ టీవీ
RELATED ARTICLES