ఓరుగల్లు9నేషనల్ టీవీ :రజాకార్’ సినిమాకు వినోదపు పన్ను నుంచి మినహాయింపు ఇవ్వాలని, స్టూడెంట్లకు సినిమా చూపించాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కోరారు. ఈ మేరకు ఆయన సీఎం రేవంత్ రెడ్డికి మంగళవారం లేఖ రాశారు. రజాకార్ల రాక్షస పాలనలో తెలంగాణ ప్రజలు పడ్డ బాధలను కళ్లకు కట్టినట్లు సినిమాలో చూపించారని తెలిపారు. నిజాంపాలన నుంచి తెలంగాణ ప్రజలకు విముక్తి కల్పించేందుకు, వారికి స్వేచ్ఛా వాయువులను అందించేందుకు, రజాకార్ల రాక్షసత్వంపై పోరాడిన యోధుల చరిత్రను సినిమాలో చూపించారని గుర్తుచేశారు.
తెలంగాణ విమోచనకు సర్దార్ వల్లబాయ్ పటేల్ చేసిన కృషి అద్భుతంగా చూపించారని ప్రశసించారు. నాటి వాస్తవాలను నేటి తరానికి తెలియజేయాలనే మంచి ఉద్దేశంతో అవరోధాలను అధిగమించి సినిమా తీసిన చిత్ర బృందాన్ని అభినందిస్తున్నట్లు చెప్పారు. ఈ సినిమాకు సర్కారు ప్రోత్సాహం అందించాల్సిన అవసరం ఉందని లేఖలో పేర్కొన్నారు. థియేటర్లలో ప్రత్యేక షో వేసి విద్యార్థులకు చూపించాలని ప్రభుత్వాన్ని బండి సంజయ్ కోరారు.