జర్నలిస్టులపై దాడులను ఖండిస్తున్నాం
వరంగల్ లో మంత్రుల సాక్షిగా జర్నలిస్టులను దూషిస్తూ నెట్టేసిన డిసిపి బారి
కార్యక్రమంలో ఆందోళన చేసిన జర్నలిస్టులు
దాడి విషయం మంత్రి కొండా దృష్టికి తీసుకెళ్లినా స్పందించని మంత్రి
సోమవారం జిల్లా వ్యాప్తంగా ఆందోళనలకు జర్నలిస్ట్ సంఘాల పిలుపు
డిసిపి స్పందించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేస్తామంటున్న జర్నలిస్ట్ సంఘాలు
వరంగల్ నగరంలో మంత్రులు పొంగులేటి, సీతక్క, కొండాసురేఖల కార్యక్రమంలో జర్నలిస్టులకు తీవ్ర అవమానం జరిగింది. కార్యక్రమ కవరేజికి వెళ్లిన జర్నలిస్టులను వరంగల్ ఈస్ట్ జోన్ డిసిపి బారీ బూతులు తిడుతూ నెట్టేశారు. తాము కవరేజికి వచ్చామని చెప్పినా వినకుండా బారీ స్వయంగా జర్నలిస్టులపై దాడికి దిగడాన్ని జర్నలిస్టులు ముక్తకంఠంతో ఖండించారు. మంత్రుల సాక్షిగా జరిగిన ఈ ఘటనపై వారు స్పందించకపోగా మంత్రి కొండా సురేఖ జర్నలిస్టులు సంయమనం పాటించాలంటూ చెప్పడం వారి నిర్లక్ష్యానికి నిదర్శనంగా కనిపించింది. గతంలో కూడా డిసిపి బారి జర్నలిస్టులపట్ల అవమానకరంగా వ్యవహరించడం, తనకు రాజకీయంగా సపోర్ట్ ఉందని తనను ఎవరూ ఏమీ చేయలేరంటూ చెప్పుకుంటున్నారు. విధినిర్వహణలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల విధులకు భంగం కలిగిస్తే ఎలాంటి చట్టాలు వర్తిస్తాయో అవే చట్టాలు విధుల్లో ఉన్న జర్నలిస్టులకు కూడా వర్తింపచేయాలని ఐజెయు వరంగల్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రామ్ చందర్, మట్టాదుర్గాప్రసాద్, ఐజెయు నేషనల్ కౌన్సిల్ సభ్యులు మిద్దెల రంగనాథ్, సంగోజు రవిలు డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జర్నలిస్టుల విషయంలో చాలా హుందాగా వ్యవహరిస్తుండగా కొందరు మంత్రులు మాత్రం చాలా అవమానకరంగా వ్యవహరిస్తూ పోలీసులు, పార్టీ కార్యకర్తలతో జర్నలిస్టులపై దాడులకు ఉసిగొల్పడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నించారు. సోమవారం లోగా మంత్రి కొండా సురేఖ స్వయంగా పూనుకుని డిసిపి బారీపై చర్యలు తీసుకోవాలని.. లేని పక్షాన తమ ఆందోళనలు రాష్ట్రవ్యాప్తం చేసి.. జరిగిన ఘటనను సిఎం దృష్టికి తీసుకెళ్తామని వారు పేర్కొన్నారు. ఈ ఘటనపై జర్నలిస్ట్ సంఘాలన్నీ ఒక్కతాటిపైకి వచ్చి సోమవారం వరంగల్ సిపి అంబర్ కిషోర్ ఝాను కలిసి మెమొరాండం ఇచ్చే కార్యక్రమానికి హాజరవాలని వారు కోరారు.