Sunday, June 29, 2025

27న ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకంపై అవగాహన సదస్సు ఓరుగల్లు9నేషనల్ టీవీ

జోగులంబ గద్వాల జిల్లా ఓరుగల్లు9నేషనల్ టీవీ ప్రతినిధి:- జోగులాంబ గద్వాల జిల్లా సంప్రదాయ చేతి వృత్తుల వారిని, హస్త కళాకారులను అన్ని విధాలుగా ప్రోత్సహిస్తూ, వారి నైపుణ్యాలను పెంపొందిస్తూ ఆర్థికంగా బలోపేతం చేయాలనే సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన(పథకం)పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈ నెల 27న మంగళవారం జిల్లా కేంద్రంలోని అక్షయ బంకేట్ హాలు నందు జిల్లా స్థాయి అవగాహన సదస్సును ఎంఎస్ఎంఈ(మైక్రో,స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్) అభివృద్ధి కార్యాలయం, హైదరాబాద్, గద్వాల జిల్లా పరిశ్రమల కేంద్రం వారి సహకారంతో నిర్వహిస్తున్నట్లు ఎంఎస్ఎంఈ సహాయ సంచాలకులు బి. శ్రీధర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సదస్సులో పథకం ఉద్దేశ్యం, ప్రయోజనాలను వివరించడం జరుగుతుందన్నారు. అర్హులైన వారందరు పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆన్ లైన్లో ఎలా దరఖాస్తు చేసుకోవాలనే దానిపై సదస్సులో అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. కమ్మరులు, స్వర్ణకారులు, కమ్మరులు, వడ్రంగులు, శిల్పులు, చేతి వృత్తుల వారు, హస్త కళాకారులు మొత్తం18 కేటగిరీలలో పని చేస్తున్న వారు ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందవచ్చని తెలిపారు. ఇతరులపై ఆధారపడకుండా సొంతంగా స్వయం ఉపాధి ఏర్పర్చుకోవాలనుకునే చేతి వృత్తిదారులు, హస్త కళాకారులకు ఈ పథకం ఎంతో ఉపయుక్తంగా నిలుస్తుందన్నారు. చేతి వృత్తులపై ఆధారపడి జీవిస్తున్న ఏ కులానికి సంబంధించిన వారైనా సరే, ఈ పథకానికి అర్హులని తెలిపారు. పీ.ఎం విశ్వకర్మ యోజన కింద దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులైన వారిని ఎంపిక చేసి వారిలో నైపుణ్యం మెరుగుదల కోసం 5రోజులపాటు శిక్షణ అందించడం జరుగుతుందని, శిక్షణ కాలంలో రోజుకు రూ. 500ల చొప్పున స్టైఫండ్ చెల్లిస్తారని, విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్న వారికి ధ్రువీకరణ పత్రం, గుర్తింపు కార్డు జారీ కూడా చేయబడుతుందన్నారు. అంతేకాకుండా వృత్తి పరికరాలు సమకూర్చుకునేందుకు వీలుగా టూల్ కిట్ కోసం రూ. 15వేల ఆర్ధిక సహాయం అందిస్తారని తెలిపారు. లబ్దిదారులు నామమాత్రంగా కేవలం ఐదు శాతం వడ్డీపై రుణ సదుపాయం పొందవచ్చని ఆయన తెలిపారు. విశ్వకర్మలు తయారు చేసే వస్తువులకు సరైన మార్కెటింగ్ వసతి లభించేలా ఎం.ఎస్.ఎం.ఈ కృషి చేస్తుందని అన్నారు. ఇలా అనేక ప్రయోజనాలతో కూడుకున్న పీ.ఎం విశ్వకర్మ పథకం గురించి గ్రామ గ్రామాన విస్తృత ప్రచారం నిర్వహిస్తూ, అర్హులైన ప్రతి ఒక్కరు ప్రయోజనం పొందాలని కోరారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular