ఓరుగల్లు9నేషనల్ ప్రతినిధి హనుమకొండ : వరంగల్ లోని ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డులో ఆదివారం చేపట్టనున్న ఓట్ల లెక్కింపు ప్రక్రియకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు హనుమకొండ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు. హనుమకొండ జిల్లా పరిధిలోని పరకాల, వరంగల్ పశ్చిమ నియోజకవర్గాలకు వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డ్ లోని స్ట్రాంగ్ రూముల వద్ద ఏర్పాటుచేసిన ఓట్ల లెక్కింపు కేంద్రాలను కలెక్టర్ శనివారం సందర్శించారు. ఓట్ల లెక్కింపునకు సంబంధించిన ఏర్పాట్లను కలెక్టర్ పరిశీలించారు. కౌంటింగ్ కేంద్రాలలో చేసిన ఏర్పాట్లను గురించి రిటర్నింగ్ అధికారులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఆదివారం ఉదయం చేపట్టనున్న ఓట్ల లెక్కింపు ప్రక్రియ గురించి కలెక్టర్ మాట్లాడుతూ హనుమకొండ జిల్లాలోని రెండు నియోజకవర్గాలైన పరకాల, వరంగల్ పశ్చిమ నియోజకవర్గాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియకు సంబంధించి అన్ని ఏర్పాట్లను పూర్తి చేశామని తెలిపారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి కౌంటింగ్ హాలులో ఓట్ల లెక్కింపునకు 14 టేబుల్ లను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ప్రతి టేబుల్ వద్ద ఓట్ల లెక్కింపునకు కౌంటింగ్ సూపర్వైజర్, కౌంటింగ్ అసిస్టెంట్,మైక్రో అబ్జర్వర్ ఉంటారని తెలిపారు.ఓట్ల లెక్కింపునకు సంబంధించి పరకాల నియోజకవర్గానికి 17 రౌండ్లు, వరంగల్ పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించి 18 రౌండ్లు కౌంటింగ్ ఉంటుందన్నారు. 8 గంటల నుంచి పోస్టల్ బ్యాలెట్ తో పాటు, ఈవీఎంలలో పోలైన ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందన్నారు. కౌంటింగ్ ప్రక్రియ కు సంబంధించి రిహార్సల్స్ జరిగాయని చెప్పారు. ఓట్ల లెక్కింపునకు సంబంధించిన సమాచారాన్ని కౌంటింగ్ కేంద్రాల వద్ద మీడియా సెంటర్ ద్వారా పత్రికలకు,ఎలక్ట్రానిక్ మీడియాకు అందజేయనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు.
ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ మహేందర్ జి, ట్రైనీ కలెక్టర్ శ్రద్ధా శుక్లా, రిటర్నింగ్ అధికారులు శ్రీనివాస్, రమేష్, ఇతర అధికారులు పాల్గొన్నారు.*ఓట్ల లెక్కింపు పై అధికారులకు శిక్షణ* వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డ్ లోని కౌంటింగ్ కేంద్రాల వద్ద ఆదివారం ఉదయం నుంచి ప్రారంభమయ్యే పరకాల, వరంగల్ పశ్చిమ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపునకు సంబందించిన పలు అంశాలపై అధికారులకు హనుమకొండ జిల్లా ఎన్నికల అధికారి,కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచనలు చేశారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలు, నిబంధనల ప్రకారం ప్రకారం కౌంటింగ్ లో పాల్గొంటున్న కౌంటింగ్ సూపర్వైజర్లు కౌంటింగ్ అసిస్టెంట్లు మైక్రో అబ్జర్వర్లు విధులు నిర్వర్తించాలని తెలిపారు. పోస్టల్ బ్యాలెట్ తో పాటు, ఈవీఎంలలో పోలైన ఓట్ల లెక్కింపును జాగ్రత్తగా లెక్కించాలన్నారు. ఎటువంటి పొరపాట్లు చోటు చేసుకోకుండా చూసుకోవాలన్నారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ అంతా వీడియో, వెబ్ కాస్టింగ్ చేయడం జరుగుతుందన్నారు. ఎలాంటి అంతరాయం లేకుండా కౌంటింగ్ కేంద్రాలలో నిరంతరాయంగా విద్యుత్ సరఫరా అయ్యే విధంగా చర్యలు చేపట్టాలని రిటర్నింగ్ అధికారులకు సూచించారు. *ఓటర్ల వారిగా వివరాలు ఇలా* వరంగల్ ఏనుమాములలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో ఉదయం 8 గంటల నుండి పోస్టల్ బ్యాలెట్, ఈవీఎంలలో పోలైన ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. జిల్లాలో పరకాల వరంగల్ పశ్చిమ నియోజకవర్గాలు ఉన్నాయి. కాగా నవంబర్ 30వ తేదీన జరిగిన ఎన్నికలు జరుగగా, ఓట్ల లెక్కింపు డిసెంబర్ మూడవ తేదీన (ఆదివారం )జరగనుంది. హనుమకొండ జిల్లాలో మొత్తం ఓటర్లు 508124 మంది ఉన్నారు. నవంబర్ 30వ తేదీన జరిగిన ఎన్నికల్లో పరకాల నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 221436 ఉండగా, 187362 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పరకాల నియోజకవర్గంలో పోలింగ్ శాతం 84.61గా నమోదైంది. అదేవిధంగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు286688 ఉండగా, ఇందులో 162236మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ నియోజకవర్గంలో పోలింగ్ శాతం 56.59 శాతంగా నమోదయింది. హనుమకొండ జిల్లాలో పోలింగ్ శాతం 68.80 గా నమోదయ్యింది. జిల్లాలోని ఈ రెండు నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎంలను వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డ్ లోని స్ట్రాంగ్ రూములలో భద్రపరిచారు. కాగా ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఆదివారం ఉదయం ప్రారంభం కానుంది.