ఓరుగల్లు9నేషనల్ టీవీ ప్రతినిధి హైదరాబాద్: సూరారంలో డ్రగ్స్ తయారు చేస్తున్న ముఠాను తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో అధికారులు శనివారం అరెస్ట్ చేశారు. సూరారం పోలీసులతో పాటు సంయుక్త ఆపరేషన్ చేసి ముఠా సభ్యులను పట్టుకున్నట్లు యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఎస్పీ గుమ్మి చక్రవర్తి తెలిపారు..
నార్కోటిక్స్ బ్యూరో అధికారులు జైలు
ఈ దాడిలో డ్రగ్స్ తయారు చేస్తున్న ముగ్గురు నిందితులు, వారి నుంచి 60 గ్రాముల క్రిస్టల్ మెథాంఫెటమైన్, 700 ఎంఎల్ లిక్విడ్ మెథాంఫెటమైన్ డ్రగ్ స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. పట్టుబడ్డ డ్రగ్స్ విలువ సుమారు రూ.50 లక్షలు ఉంటుందన్నారు..
ఎస్పీ మాట్లాడుతూ.. ”డ్రగ్స్ తయారు చేస్తున్నవారిలో ప్రధాన నిందితుడు కె.శ్రీనివాస్‌గా గుర్తించాం. అతను ప్రైవేటు ఉద్యోగం చేస్తూ నగరంలోని గాజుల రామారంలో నివాసం ఉంటున్నాడు. నిందితుడు శ్రీనివాస్‌కు డ్రగ్స్ తయారీపై అవగాహన ఉంది. 2013లో ఓ పరిశ్రమలో డ్రగ్స్ తయారు చేయగా.. నార్కోటిక్స్ బ్యూరో అధికారులు జైలుకు పంపారు. జైలు నుంచి బయటికి వచ్చాక నరసింహ రాజు, మణికంఠతో కలిసి సూరారంలో ఒక ఇంట్లో డ్రగ్స్ తయారు చేయడం మొదలుపెట్టారు. ఈ ముగ్గురూ కలిసి గత రెండేళ్లుగా డ్రగ్స్ తయారు చేసి వివిధ ప్రాంతాల్లో విక్రయిస్తున్నారు. లిక్విడ్ మెథాంఫెటమైన్ తీసుకొని ప్రాసెస్ చేసి డ్రై చేస్తే క్రిస్టల్ మెథాంఫెటమైన్ డ్రగ్ తయారవుతుంది. అలా తయారు చేసిన మాదకద్రవ్యాలను వివిధ ప్రాంతాల్లో విక్రయించారు. సోషల్ మీడియా ద్వారా విక్రయాలు కొనసాగించారు” అని ఎస్పీ వివరించారు. అదుపులోకి తీసుకున్న ముగ్గురు నిందితులపై పీడియాక్ట్ నమోదుకు ప్రతిపాదన చేసినట్లు ఎస్పీ వెల్లడించారు..