జోగులాంబ గద్వాల జిల్లా ఓరుగల్లు9నేషనల్ టీవీ జోగులాంబ గద్వాల జిల్లాలో జరిగిన కాంగ్రెస్ ప్రజా వేదిక బహిరంగ సభలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఘాటైన విమర్శలు గుప్పించారు. తెలంగాణ రాష్ట్రంలో తొమ్మిదేళ్ల బీఆర్ఎస్ పరిపాలనలో 24గంటల పాటు ఉచిత కరెంటు ఇస్తున్నామని నిరూపిస్తే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులమంతా వెంటనే తమ నామినేషన్లు ఉపసంహరించుకుంటామని, లేదని మేము నిరూపిస్తే గద్వాల బస్టాండు ప్రాంతంలో ముక్కు నేలకు రాస్తావా కేసీఆర్ అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. మంగళవారం జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని మెళ్లచెర్వు చౌరస్తా సమీపంలో గద్వాల కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సరిత తిరుపతయ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ ప్రజా వేదిక బహిరంగ సభకు రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ వయస్సు మీద పడుతున్నా కూడా అబద్దాలు ఆడడం మరిచిపోలేదని ఎద్దేవా చేశారు. తన వయసుకు మించి అబద్ధాలు ఆడడంలో కేసీఆర్ కి వెన్నతో పెట్టిన విద్య అని అన్నారు. రాష్ట్రంలో రైతులకు 24 గంటల ఉచిత కరెంటు ఇస్తున్నామని చెపుతున్నారని, ఇప్పుడే వెళ్లి విద్యుత్ సబ్ స్టేషన్లకు వెళ్లి లాక్ బుక్కు చూస్తే వారి బండారం బయట పడుతుందని, దీన్ని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తే రైతులకు తాము వ్యతిరేకం అనే ప్రచారం చేస్తూ మభ్యపెడుతున్నారని అన్నారు. అసలు రైతులకు ఉచిత కరెంటు పథకం అమలు చేసిందే కాంగ్రెస్ పార్టీ అని, 2004 ఎన్నికల్లో నాటి ముఖ్యమంత్రి వైఎస్. రాజశేఖర్ రెడ్డి ప్రమాణ స్వీకారం రోజు మొదటి సంతకం పెట్టి 9గంటల ఉచిత కరెంటు అందజేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ వస్తే కష్టాలు తప్పవని ప్రచారం చేస్తున్న బీఆర్ఎస్ నాయకులకు అసలు సిగ్గుందా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ నిర్మించిన ప్రాజెక్టుల వల్ల ప్రజలు కష్టాలు పడ్డారా, ప్రతి ఇంటికి వంద యూనిట్ల వరకు ఉచిత కరెంటు ఇచ్చినందుకు కష్టాలు పడ్డారా, ఇందిరమ్మ ఇళ్ళు నిర్మించినందుకా, లేక ఉపాధి హామీ పథకం తెచ్చినందుకా ప్రజలు కష్టాలు పడింది అన్నది చెప్పాలని నిలదీశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ 2010లో వరదలు వచ్చి అలంపూర్ నియోజకవర్గం అతలాకుతలం అయితే నాడు ఉమ్మడి పాలమూరు జిల్లాకు ఎంపీగా ఉండి కనీసం ఒక్క కుటుంబాన్ని ఆదుకున్న పాపాన పోలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రారంభించిన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పదేళ్లయినా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా వదిలేశారని ఎద్దేవా చేశారు. ఇక రాష్ట్రంలో ఎక్కడకు వెళ్లినా కేసీఆర్ ధరణి ప్రాజెక్టును ముందుకు తీసుకొచ్చి రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారని, అసలు ధరణిని 2018 ఎన్నికల్లో ప్రకటించి 2020లో అమలు చేసి అప్పటి వరకు రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ భూముల మ్యూటేషన్ పేరుతో ఆక్రమించింది నిజం కాదా అని ప్రశ్నించారు. తాము అధికారంలోకి వస్తే ధరణి ప్రాజెక్టులో మార్పులు తీసుకొచ్చి ఆక్రమించిన భూములను తిరిగి పేదలకు పంచుతామంటే తమపై అబద్ధపు ప్రచారం చేయడం సిగ్గుచేటన్నారు. అందుకే తెలంగాణ రాష్ట్ర ప్రజల బతుకులు మారాలంటే రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకే సాధ్యమని భావించి సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఆధ్వర్యంలో జరిగిన బహిరంగ సభలలో ఆరు గ్యారెంటీల పథకాలను తీసుకురావడం జరిగిందన్నారు. వీటిని కర్ణాటక రాష్ట్రం తరహాలోనే తెలంగాణలోనూ నిక్కచ్చిగా అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ప్రజలందరూ ఆలోచించి బడుగు బలహీన వర్గాల పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి కుటుంబానికి 200యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ అందజేస్తామని, వచ్చే నెలలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ప్రజలెవరు కూడా కరెంటు బిల్లులు కట్టాల్సిన అవసరం లేదని అన్నారు. అంతేకాకుండా ఆడబిడ్డల కళ్ళలో ఆనందం నింపడానికి ప్రతి నెల ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా వారి ఖాతాలో రూ. 2500 జమ చేయడం జరుగుతుందని, రూ. 500లకే గ్యాస్ సిలిండర్, పింఛన్లు అందజేస్తామని తెలిపారు. రైతులకు రైతు బంధు ఇచ్చినట్టే కౌలు రైతులకు కూడా ఇవ్వనున్నట్లు చెప్పారు. ఈ ప్రాంతంలో బహుజన ఆడబిడ్డగా మీ ముందుకు వచ్చిన సరిత గెలుపు కోసం ప్రతి ఒక్కరు హస్తం గుర్తుపై ఓటు వేసి అధిక మెజారిటీతో గెలిపించి అసెంబ్లీకి పంపించాలని పిలుపునిచ్చారు.
మీ బహుజన ఆడబిడ్డను వచ్చాను ఆదరించండి…ఎమ్మెల్యే అభ్యర్థి సరిత
ఈ ప్రాంతంలో బడుగు బలహీన వర్గాల ప్రజల కష్టాలు చూసి చలించి పోయాయని, ఇక్కడ అధికారంలో కొనసాగుతున్న నేతలు ఇప్పటి వరకు వారి స్వలాభం చూసుకున్నారే తప్పా ప్రజలను పట్టించుకున్న పాపానపోవడం లేదన్నారు. బహుజనుల కష్టాలను తీర్చేందుకు తనవంతు ఏదైనా చేయాలని, వారి జీవన విధానంలో మార్పు తీసుకురావాలనే ఉద్దేశ్యంతో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీలో నిలవడం జరిగిందన్నారు. నియోజకవర్గ ప్రజలు ఒక్కసారి ఆలోచించి బహుజన ఆడబిడ్డగా మీ ముందుకు వచ్చిన తనకు మీ ఆశీర్వాదం ఉండాలని కోరారు. తనకు ఒక్కసారి అవకాశం కల్పించి చూడాలని, ప్రతి ఒక్కరు చేయి గుర్తుపై ఓటు వేసి గెలిపించి తనను అసెంబ్లీకి పంపించాలని అభ్యర్థించారు. అదే విధంగా మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, వనపర్తి కాంగ్రెస్ అభ్యర్ధి మేఘారెడ్డి, కాంగ్రెస్ నాయకులు బండ్ల చంద్రశేఖర్ రెడ్డి తదితరులు మాట్లాడుతూ గద్వాల గడ్డపై కాంగ్రెస్ జెండాను ఎగురవేయాలని, ఇందుకు ప్రజలందరు సహకరించాలని కోరారు.
ఆకట్టుకున్న ఆటపాట…
బహిరంగ సభకు రేవంత్ రెడ్డి వస్తున్న సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులు భారీ జన సమీకరణ చేసి పెద్ద ఎత్తున వారిని సభకు తరలించి విజయవంతం చేశారు. ఈ సందర్భంగా సభకు రేవంత్ రెడ్డి రాక కొంత ఆలస్యం అయినా ప్రజలు ఎక్కడ ఇబ్బందులు పడకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా కళాకారులు తమ ఆటపాటలతో ప్రజలలో ఉత్తేజాన్ని నింపారు. ఎక్కడ ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా సభ విజయవంతం కావడం పట్ల సరిత తిరుపతయ్య ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు.