ఓరుగల్లు9నేషనల్ టీవీ ప్రతినిధి :సిద్దిపేట జిల్లా ప్రజల కల నెరవేరింది. ఎన్నో ఏండ్ల నుంచి వస్తుంది వస్తుంది అనుకుంటున్న రైలు ఎట్టకేలకు కూత పెట్టింది. దశాబ్దాల వాంఛ అక్టోబర్ 3వ తేదీన సాకారం అయింది. అక్టోబర్ 3వ తేదీన సిద్దిపేట, సికింద్రాబాద్ మధ్య నడిచే పుష్ పుల్ రైలుకు వర్చువల్ ద్వారా ప్రధానమంత్రి నరేంద్రమోదీ జెండా ఊపి ప్రారంభించారు.
సికింద్రాబాద్ -మన్మాడ్ వెళ్లే మార్గంలో మెదక్ జిల్లా మనోహరాబాద్ నుంచి రైల్వేలైన్ సిద్దిపేట జిల్లాకు ప్రారంభమవుతుంది. సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్, సిద్దిపేట మీదుగా సిరిసిల్ల, వేములవాడ, బోయినపల్లి వరకు ఈ మార్గం ఉంటుంది. బోయినపల్లి నుంచి కరీంనగర్ జిల్లాలోని వెదిర మీదుగా పెద్దపల్లి- నిజమాబాద్ వెళ్లే మార్గంలో కొత్తపల్లి దగ్గర ఈ రైల్వే లైన్ కలుస్తుంది.
07483 నెంబర్ గల ప్యాసింజర్ రైలు..సిద్దిపేటలో ఉదయం 6.45 గంటలకు బయలుదేరి 10.15 గంటలకు సికింద్రాబాద్‌కు చేరుకుంటుంది. ఆ తర్వాత సికింద్రాబాద్‌లో 07484 నెంబర్ గల రైలు సికింద్రాబాద్ నుంచి ఉదయం 10.35 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 1.45 గంటలకు సిద్దిపేట చేరుకుంటుంది. తిరిగి సిద్దిపేటలో మధ్యాహ్నం 2.05 గంటలకు బయలుదేరి..సాయంత్రం 5.10గంటలకు సికింద్రాబాద్‌కు చేరనుంది. సాయంత్రం 5.45 గంటలకు సికింద్రాబాద్‌లో బయలుదేరనున్న రైలు.. సిద్ధిపేటకు రాత్రి 8.40 గంటలకి చేరుకుటుంది.