తెలంగాణ అభివృద్ధి కోసం బీజేపీ కట్టుబడి ఉందన్నారు ప్రధాని మోదీ. రాష్ట్రంలో ఆస్పత్రులు, కొత్త రైల్వే లైన్లు నిర్మిస్తున్నట్లు చెప్పారు. ఎంతో మంది బలిదానాలతో తెలంగాణ సాకారమైందన్న మోదీ.. రాష్ట్ర ప్రజల సంపదను ఓ కుటుంబం దోచుకుంటోందని విమర్శించారు. తెలంగాణ ఏర్పడిన ప్రతిఫలాన్ని ఒక కుటుంబమే అనుభవిస్తోందని, కేసీఆర్, ఆయన కుమారుడు, కుమార్తె, అల్లుడు మాత్రమే ధనికులయ్యారని ఆరోపించారు. తెలంగాణ యువత కుటుంబ పాలనకు మరో అవకాశం ఇవ్వొద్దని మోదీ పిలుపునిచ్చారు. నిజామాబాద్ జిల్లా పర్యటనలో ఉన్న మోదీ.. ఇందూరు గిరిరాజ్ కళాశాలలో ఏర్పాటు చేసిన బీజేపీ జనగర్జన సభలో ప్రసంగించారు.
దేశం మొత్తం కాంగ్రెస్ పార్టీని విస్మరిస్తోందన్నారు మోదీ. బీఆర్ఎస్ తో కాంగ్రెస్ చీకటి పొత్తు పెట్టుకుందన్నారు. కేంద్రం ఇచ్చే నిధులను బీఆర్ఎస్ సర్కార్ లూటీ చేస్తోందని ఆరోపించారు. కర్నాటకలో కాంగ్రెస్ కు బీఆర్ఎస్ నిధులు పంపిందన్నారు. తెలంగాణ ప్రజలను దోచి.. బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ కు నిధులు ఇస్తోందని ఆరోపించారు. వందకు వందశాతం నిజం చెప్పడానికే తాను తెలంగాణకు వచ్చానన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని దోపిడీ స్వామ్యంగా మార్చారని, ప్రజాస్వామ్యాన్ని కుటుంబ స్వామ్యంగా మర్చారని అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ కుటుంబం కబ్జా పెట్టిందన్నారు