ఓరుగల్లు9నేషనల్ టీవీ :ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు కేసీఆర్ కుట్రలు పన్నుతున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయనను ప్రజలు తిరస్కరించినా మార్పు రాలేదని అన్నారు. తన పార్టీ పేరును మార్చుకున్న రోజే ఈ రాష్ట్రంతో పేగుబంధం తెగిపోయిందని చెప్పారు. ఇవాళ నిజామాబాద్ లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పదేండ్లు రాష్ట్రాన్ని పాలించిన పార్టీకి అభ్యర్థి దొరకలేదా..? అని ప్రశ్నించారు.బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటేనని, రెండు పార్టీల నాయకులు కలిసి కాంగ్రెస్ ను ఓడించేందుకు కుట్రలు చేస్తున్నాయని అన్నారు.
కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫార్ములా ఈ రేసింగ్ కేసులో కేటీఆర్ ను ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నిస్తున్నారని, ‘కేసు నమోదు చేయగానే ఈడీని పంపింది కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా మీరు కాదా బండి సంజయ్’ అని ప్రశ్నించారు. కేసుకు సంబంధించిన ఫైళ్లు ఈడీ తీసుకెళ్లడంతోనే విచారణ ముందుకు సాగడం లేదన్నారు.అదే విధంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏ1గా ఉన్న ప్రభాకర్ రావును రప్పించేందుకు రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేస్తే తొక్కిపెట్టింది మీరు కాదా అని బండి సంజయ్ ని సీఎం ప్రశ్నించారు. పదేండ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్.. రాష్ట్రాన్ని 8 లక్షల కోట్ల అప్పుల పాలు చేసి వెళ్లారని అన్నారు. ఖజానా ఖాళీ చేసి వెళ్లి ఫాంహస్ లో పడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ, ఎంపీ ఎన్నికల్లో ఓడిపోయినా బీఆర్ఎస్ నాయకులకు బుద్ధిరాలేదని అన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంపై కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.
ఈ 15 నెలల కాంగ్రెస్ పాలనపై చర్చ జరగాలని అన్నారు. తాము అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 55,163 ఉద్యోగాలు భర్తీ చేశామని చెప్పారు. తాము ఉద్యోగాలు భర్తీ చేసింది నిజమైతేనే కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయాలని గ్రాడ్యుయేట్లను సీఎం కోరారు. వందేండ్లుగా పెండింగ్ లో ఉన్న కులగణన సమస్యకు పరిష్కారం చూపామని వివరించారు. పారదర్శకంగా కులగణన చేస్తే కేటీఆర్, కేంద్రమంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి తప్పులున్నాయని అంటున్నారని, ఎక్కడున్నాయో చూపించి విమర్శించాలని అన్నారు. ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని, సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి వర్గీకరణ చేపట్టామని అన్నారు. మంద కృష్ణను కౌగిలించుకున్న నరేంద్ర మోదీ ఆ పనిచేయలేక పోయారని ఫైర్ అయ్యారు.రైతులకు రూ. 2 లక్షల రుణమాఫీ, పంట సాగు కోసం పెట్టుబడి కింద రైతు భరోసా పడితేనే తమ పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డికి ఓట్లు వేయాలని అన్నారు.