ఓరుగల్లు9నేషనల్ టీవీ :పంచాయతీ ఎన్నికలకు వేగంగా అడుగులు పడుతున్నాయి. సర్పంచ్, ఎంపీటీసీ ఎన్నికలను వెంట వెంటనే నిర్వహించనుందని సమాచారం. ఎన్నికలకు సన్నద్ధతపై ఇటు ప్రభుత్వం, అటు ఎన్నికల కమిషన్ అధికారులతో సమీక్షలు నిర్వహిస్తోంది. ఓటర్ల జాబితాను సైతం ఈసీ ఇటీవలే ప్రకటించింది. ముందుగా సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలని భావిస్తోంది. ఆ తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్స్ పెట్టే అవకాశం ఉంది.ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కమాండ్ కంట్రోల్ సెంటర్ లో పంచాయతీ ఎన్నికలపై సీఎస్ శాంతి కుమారి, పంచాయతీరాజ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ మేరకు బీసీ రిజర్వేషన్లపై క్లారిటీ వచ్చిన వెంటనే షెడ్యూల్ రిలీజయ్యే అవకాశం ఉంది. 42% సీట్లు ఇవ్వడానికి సుప్రీంకోర్టు తీర్పులు అడ్డొస్తున్న నేపథ్యంలో పాత పద్ధతినే అమలు చేస్తారని తెలుస్తోంది.
ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లు యాభైశాతం ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. అంతకన్నా ఎక్కువ సీట్లు కేటాయించాలంటే రాజ్యాంగ సవరణ జరగాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ఉభయ సభలను సమావేశపర్చి రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. ఈ తరుణంలో అది సాధ్యం కాదని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ.. ఒక అడుగు ముందుకు వేసింది. తమ పార్టీ 42% సీట్లను బీసీలకు కేటాయిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ప్రకటించారు.