ఓరుగల్లు9నేషనల్ టీవీ హనుమకొండ: హనుమకొండ జిల్లాలోని వరంగల్ పశ్చిమ, పరకాల నియోజకవర్గాల్లో గురువారం జరగనున్న పోలింగ్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు హనుమకొండ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు. వరంగల్ ఏనుమాములలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో వరంగల్ పశ్చిమ,పరకాల నియోజకవర్గాల ఈవీఎంల పంపిణీని కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గురువారం ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు నిర్వహించే పోలింగ్కు సర్వం సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు. ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం అంతా సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఈ రెండు నియోజకవర్గాల్లో ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. ఈవీఎంలతోపాటు ఇతర పోలింగ్ సామగ్రి తరలింపును కట్టుదిట్టమైన భద్రత మధ్య పోలింగ్ కేంద్రాలకు తరలించినట్లు పేర్కొన్నారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను సందర్శించిన కలెక్టర్ ఈవీఎంలు ఇతర పోలింగ్ సామగ్రి పంపిణీ ప్రక్రియను పరిశీలించారు. పోలింగ్ విధులకు హాజరైన అధికారులు సిబ్బంది హాజరు వివరాలను జనరల్ అబ్జర్వర్ డాక్టర్ హెచ్. ఎన్. గోపాలకృష్ణ, పోలీస్ అబ్జర్వర్ తోగో కర్గా, కలెక్టర్ సిక్తా పట్నాయక్, అడిగి తెలుసుకున్నారు. పోలింగ్ అధికారులు సిబ్బందితో మాట్లాడారు. ఈవీఎంల డెమోను పరిశీలించారు. ఈ సందర్భంగా రిటర్నింగ్ అధికారులు, సెక్టోరియల్ అధికారులు, పోలింగ్ అధికారులు, అదనపు పోలింగ్ అధికారులు, ఇతర పోలింగ్ అధికారులకు కలెక్టర్ సలహాలు సూచనలు చేశారు. ఈవీఎంలు, పోలింగ్ సామగ్రి పోలింగ్ కేంద్రాలకు తరలించే వాహనాల గురించి కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.
ఏనుమాములలోని డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల వద్ద వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వైద్య సేవలను పరిశీలించారు. ఎన్నికల విధులలో పాల్గొంటున్న పోలింగ్ సిబ్బందికి భోజన సదుపాయాలను పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల వద్ద భద్రతా ఏర్పాట్లు గురించిపోలీస్ అధికారులు సిబ్బందికి సెంట్రల్ జోన్ డిసిపి ఎంఏ భారీ పలు సూచనలు చేశారు. వరంగల్ పశ్చిమ, పరకాల నియోజకవర్గాల్లోని పోలింగ్ కేంద్రాలకు ఈవీఎంలు ఎన్నికల సామగ్రితో వెళ్తున్న ఎన్నికల సిబ్బంది వాహనాల ముందు జిల్లా జనరల్ అబ్జర్వర్ డాక్టర్ హెచ్. ఎన్ గోపాలకృష్ణ, కలెక్టర్ సిక్తా పట్నాయక్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మహేందర్ జీ, ట్రైనీ కలెక్టర్ శ్రద్ధా శుక్లా, రిటర్నింగ్ అధికారులు రమేష్,శ్రీనివాస్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డులో ఈవీఎంలు, పోలింగ్ సామగ్రి డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల వద్ద జిల్లా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల్లో ఓటు కలిగిన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును తప్పకుండా వినియోగించుకోవాలని కోరారు. ఉన్నటువంటి ప్రతి పోలింగ్ కేంద్రంలో ఓటేసేందుకు వచ్చే ఓటర్లకు తాగునీరు ర్యాంపు, తదితర సౌకర్యాలను కల్పించినట్లు తెలిపారు. పోలింగ్ శాతాన్ని పెంచేందుకు జిల్లాలో పలు కార్యక్రమాలను నిర్వహించినట్లు తెలిపారు. ముఖ్యంగా యువత ఓటు హక్కును వినియోగించుకునే విధంగా స్వీప్ ఆధ్వర్యంలో కార్యక్రమాలను చేపట్టినట్లు తెలిపారు. వరంగల్ పశ్చిమ పరకాల నియోజకవర్గాల్లో 484 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని చెప్పారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో సౌకర్యాలను కల్పించినట్లు కలెక్టర్ పేర్కొన్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ చేస్తున్నట్లు తెలిపారు. జిల్లా కేంద్రంలో కంట్రోల్ రూమ్, మీడియా కంట్రోల్ రూమ్, వెబ్ కాస్టింగ్ కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు కలెక్టర్ వివరించారు.