ఓరుగల్లు9నేషనల్ టీవీ ప్రతినిధి :ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీశైల మహాక్షేత్రంలో దేవీ శరన్నవరాత్రులు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆదివారం ఉదయం 9:30 గంటలకు వేదమంత్రో చ్చారణలు, మంగళవాయిద్యాల మధ్య అర్చక స్వాములు, వేద పండితులు ఉత్సవాలకు అంకురార్పణ చేశారు. ముందుగా శ్రీశైల దేవస్థాన ధర్మకర్తల మండలి అధ్యక్షుడు రెడ్డివారి చక్రపాణి రెడ్డి దంపతులు, ఈఓ పెద్దిరాజు, ధర్మకర్తల మండలి సభ్యులు, ఉభయ దేవాలయాల ప్రధానార్చకులు, అధికారులు సంప్రదాయబద్ధంగా పసుపు, కుంకుమ, ఫలపుష్పాలతో ఆలయ ప్రవేశం చేశారు.
ఉత్సవాలకు నాందిగా ఉదయం 11:30 గంటలకు అమ్మవారి ఆలయ మండపంలో యాగశాల ప్రవేశం, గణపతి పూజ, శివ సంకల్పం, చండీశ్వర పూజ, కంకధారణ పూజ, కలశధారణ కార్యక్రమాలు నిర్వహించారు. అలాగే అఖండ దీపస్థాపన, వాస్తు పూజ, వాస్తు హోమం తదితర పూజలు చేసి దసరా మహోత్సవాలను ప్రారంభించారు. నవదుర్గ అలంకరణలో భాగంగా మొదటి రోజు భ్రమరాంబ దేవి శైలపుత్రి స్వరూపంలో భక్తులకు దర్శనమిచ్చారు.