ఓరుగల్లు9 నేషనల్ టివి నిర్మల్ జిల్లా ప్రతినిధి, మే 22 :
అంతా చేతికొచ్చిన పంట.. కళ్ల ముందే కరిగిపోతుంటే గుండె తరుక్కుపోతుంది సార్!” – ఇది అకాల వర్షాలకు పంట నష్టపోయిన ఓ రైతు ఆవేదన. చిత్రంలో కనిపిస్తున్న ఈ రైతు, ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తడిసి, మొలకెత్తిన తన వరి ధాన్యాన్ని చేతుల్లో పట్టుకుని, దిక్కుతోచని స్థితిలో నిలబడ్డాడు.
నెలల తరబడి రేయింబవళ్లు కష్టపడి పండించిన ధాన్యం, చేతికందే సమయంలో అకాల వర్షాల బారిన పడి నాశనమవడంతో అన్నదాత కన్నీరుమున్నీరవుతున్నాడు. ఆరబోసిన ధాన్యం కుప్పలు కుప్పలుగా తడిసిపోవడం, వాటిని చూస్తూ నిస్సహాయంగా నిలబడటం తప్ప ఏమీ చేయలేని స్థితిలో ఉన్నాడు. భవిష్యత్తుపై భరోసా కోల్పోయిన ఈ రైతు, ప్రభుత్వం వెంటనే స్పందించి, ఆదుకోవాలని వేడుకుంటున్నాడు. ఈ నష్టం నుంచి తమను గట్టెక్కించాలని, తక్షణమే నష్టపరిహారం అందించి ఆదుకోవాలని కోరుతున్నాడు. ఈ చిత్రంలోని రైతు ఆవేదన, రాష్ట్రవ్యాప్తంగా అకాల వర్షాలకు నష్టపోయిన వేలాది మంది రైతుల దీనస్థితికి అద్దం పడుతోంది.