వేధింపులు, నిబంధనల ఉల్లంఘనలతో అశాంతి!
పని గంటలు దాటినా కార్యాలయాల్లోనే నిర్బంధం
ఇంటి పనులు వదిలి రావాల్సి వస్తున్న ఉద్యోగులు!
ఓరుగల్లు9 నేషనల్ టివి నిర్మల్ జిల్లా ప్రతినిధి, మే 18 :
నిర్మల్ జిల్లా చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ తన నిరంకుశ పాలనతో ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తిని రేకెత్తిస్తున్నారు. మండల ప్లానింగ్ మరియు స్టాటిస్టికల్ ఆఫీసర్లుతో పాటు ఇతర క్షేత్రస్థాయి సిబ్బందిని ఆయన వేధిస్తున్నారని, ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పని గంటలు ముగిసినా కార్యాలయాల్లోనే ఉండాలని బలవంతం చేయడంతో ఇటు ఇంటి పనులు అటు ఉద్యోగ బాధ్యతలు సమన్వయం చేసుకోలేక ఉద్యోగులు తీవ్ర మానసిక క్షోభకు గురవుతున్నారు.
సూర్యాస్తమయం దాటినా హార్డ్ కాపీల కోసం ఒత్తిడి
పని గంటలు ముగిసిన తర్వాత కూడా హార్డ్ కాపీలను భౌతికంగా సమర్పించాలని సిపిఓ పట్టుబట్టడం ఉద్యోగుల వ్యక్తిగత జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే ఉద్యోగులు రాత్రిపూట ప్రయాణాలు చేయాల్సి వస్తుండటంతో వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కుటుంబంతో గడిపే సమయం కూడా దొరకడం లేదని ఉద్యోగులు వాపోతున్నారు.
ప్రామాణిక పద్ధతులకు తిలోదకాలు
సిపిఓ సొంత రూల్స్‌తో తప్పుల తడకగా మారుతున్న డేటా!
గణాంక సేకరణ, విశ్లేషణలో పాటించాల్సిన శాస్త్రీయ పద్ధతులను సిపిఒ పూర్తిగా విస్మరిస్తున్నారని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. తన సొంత ఇష్టానుసారం పద్ధతులను అమలు చేయాలని ఒత్తిడి చేస్తుండటంతో సేకరించిన డేటా యొక్క విశ్వసనీయత ప్రశ్నార్థకంగా మారుతోంది.
హఠాత్తుగా రిపోర్టింగ్ గడువులు – ఉద్యోగులపై రెట్టింపు పనిభారం, వ్యక్తిగత జీవితాలపై ప్రభావం!
ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా హఠాత్తుగా రిపోర్టుల సమర్పణకు గడువులు విధించడం ఉద్యోగులపై తీవ్రమైన పనిభారాన్ని మోపుతోంది. తక్కువ సమయంలో ఎక్కువ పని చేయాల్సి రావడంతో వ్యక్తిగత పనులకు కూడా సమయం కేటాయించలేని పరిస్థితి నెలకొంది.
గర్భిణీ ఉద్యోగులపై ప్రత్యేక వివక్ష – వెటర్నరీ లీవ్‌కు నిరాకరించి వేధింపులు!
గర్భిణీ స్త్రీలు వెటర్నరీ సెలవు తీసుకోవడానికి దరఖాస్తు చేసుకుంటే, సీపీఓ వారిని తీవ్రంగా టార్చర్ పెడుతున్నారని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. సెలవులు మంజూరు చేయకుండా పని ఒత్తిడి పెంచడం, అనవసరమైన ప్రశ్నలు అడగడం వంటి చర్యలతో వారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది.
క్షేత్రస్థాయి సిబ్బంది సమస్యలు పట్టించుకోని అధికారి – సరైన సౌకర్యాలు లేక ఇబ్బందులు!
మండల స్థాయిలో పనిచేస్తున్న ఉద్యోగులు అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారు. సరైన కార్యాలయ సౌకర్యాలు లేకపోవడం, సిబ్బంది కొరత వంటి సమస్యలను సిపిఒ దృష్టికి తీసుకెళ్లినా ఆయన పట్టించుకోవడం లేదని ఉద్యోగులు వాపోతున్నారు.
కలెక్టర్ ఆదేశాలను ధిక్కరించిన సిపిఒ
ఎన్యూమరేటర్ల వేతనాలు నిలిపివేత, ఉద్యోగులపై అదనపు భారం!
ఎస్ ఇ పి సి సర్వే కోసం నియమించబడిన రిజర్వ్ ఎన్యూమరేటర్లకు పారితోషికం చెల్లించాలని కలెక్టర్ ఆదేశించినప్పటికీ, సిపిఓ వాటిని నిలిపివేయడం ఉద్యోగులపై అదనపు భారాన్ని కలిగిస్తోంది. వేతనాలు అందక ఆ ఎన్యూమరేటర్లు ఇప్పుడు ఎంఎస్పీఓ ను ఆశ్రయిస్తున్నారు.
న్యాయం కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగులు – ఉన్నతాధికారుల జోక్యంతోనే సమస్యకు పరిష్కారం!
నిర్మల్ జిల్లాలోని ఉద్యోగులు సిపిఓ యొక్క ఈ నిరంకుశ పాలనతో విసిగిపోయారు. వారు ఇప్పుడు న్యాయం కోసం ఉన్నతాధికారుల జోక్యానికి వేడుకుంటున్నారు. తక్షణమే ఈ విషయంపై సమగ్ర విచారణ జరిపి, సిపిఓ పై తగిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే, ఉద్యోగుల ఆందోళనలు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది. ఈ పరిణామాలు జిల్లా పరిపాలనపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని ఉద్యోగ సంఘాలు హెచ్చరిస్తున్నాయి.
నాపై అభియోగాలు అవాస్తవం
మండల ప్లానింగ్, స్టాటిస్టికల్ అధికారులు తనపై చేస్తున్న ఆరోపణలు, అభియోగాలు పూర్తి అవాస్తవమని చీప్ ప్లానింగ్ ఆఫీసర్ జీవరత్నం అన్నారు. మా ప్రతినిధి చరవాణి ద్వారా వివరణ కోరగా వారు స్పందించారు. ఎన్యుమేరేటర్ల వేతనాలు వేతనాలు ఏ జిల్లాలో ఇంకా విడుదల కాలేదని, అది తన చేతిలో లేని పని అని తెలిపారు. పనులను సక్రమంగా చేయాలని ఆదేశాలు జారీ చేసినందుకే తనపై ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని అన్నారు.