ఓరుగల్లు9 నేషనల్ టివి నిర్మల్ జిల్లా ప్రతినిధి, ఏప్రిల్ 30 :
నిర్మల్ జిల్లా కు 10 లో 15వ స్థానం…!
గత రెండు పర్యాయాలు మొదటి స్థానం ….
బిట్ కాయిన్ ప్రభావం చూపిందా..!
డీఈవో కు ఉపాధ్యాయులకు సమన్వయ లోపమే కారణమా..?
నిర్మల్ జిల్లా విద్యాశాఖ అధికారిగా ఇదివరకు బాధ్యతలు నిర్వర్తించిన రవీందర్ రెడ్డి మహబూబాబాద్ బదిలీపై వెళ్లారు. వారు అక్కడికి వెళ్లిన మూడు నెలల్లోనే మహబూబాబాద్ రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచింది. మరి గత రెండు సంవత్సరాల నుండి మొదటి స్థానంలో నిలిచిన నిర్మల్ జిల్లా డీఈఓ మారగానే 15వ స్థానంలోకి పడిపోవడానికి కారణం ఏంటి…?
చదువుల తల్లి కొలువైన నిర్మల్ జిల్లాలో విద్యావ్యవస్థ గాడి తప్పిందా..? అంటే అవునని విమర్శిస్తున్నారు పలువురు విద్యావేత్తలు.పదవ తరగతి పరీక్షా ఫలితాలలో నిర్మల్ జిల్లా పూర్వ వైభవం బుధవారం ప్రకటించిన ఫలితాలతో ఒక్కసారిగా నెలకంటింది. గత రెండు సంవత్సరాల పదవ తరగతి పరీక్షా ఫలితాలను పరిశీలిస్తే రాష్ట్రస్థాయిలో మొదటి స్థానంలో నిలిచిన నిర్మల్ జిల్లా బుధవారం ప్రకటించిన ఫలితాలలో రాష్ట్రంలో 15వ స్థానంలో నిలిచింది. ఒకటవ స్థానం నుండి 15వ స్థానానికి పడిపోవడానికి కారణం ఏంటి అని పలువురు విద్యావేత్తలు విశ్లేషణాత్మక విమర్శలు చేస్తున్నారు. కర్ణుడి చావుకు నోరు తప్పులు అన్న చందంగా నిర్మల్ విద్యావ్యవస్థ గాడి తప్పింది అని పలువురు తీవ్రస్థాయిలో విమర్శిస్తున్నారు.
పది లో 15వ స్థానం
బుధవారం ప్రకటించిన పదవ తరగతి పరీక్షా ఫలితాలలో నిర్మల్ జిల్లా 15 వ స్థానంతో సరిపెట్టుకుంది. గత రెండు పర్యాయాలు మొదటి స్థానంలో నిలిచిన నిర్మల్ జిల్లా ఒక్కసారిగా 15వ స్థానానికి పడిపోవడంతో పలువురు తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. విద్యావ్యవస్థలో పోటీ ఎక్కువగా ఉంటుంది అలా అని రెండు పర్యాయాలు మొదటి స్థానంలో నిలిచిన జిల్లా ఎందుకు 15వ స్థానానికి పరిమితమైంది అంటూ ప్రశ్నిస్తున్నారు. ప్రతి సంవత్సరం మొదటి స్థానం రావాలని గ్యారంటీ లేదు కానీ ఏదో ఒకటి నుండి ఐదు స్థానాల వరకు సాధించే అవకాశం ఉంటుంది కదా అని ప్రశ్నిస్తున్నారు. గత రెండు పర్యాయాలు 100% ఉత్తమ ఫలితాలు సాధించిన జిల్లా ఈ సంవత్సరం ప్రకటించిన ఫలితాలలో 96.7% విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. జిల్లా వ్యాప్తంగా 9123 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా 8822 మంది 96.70% ఉత్తీర్ణతతో విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు.ఇందులో బాలురు 4441 మందికి 4261 మంది ఉత్తీర్ణులు కాగా బాలికలు 4682 కు 4561 మంది ఉత్తీర్ణత సాధించారు.
విద్యా వ్యవస్థ పై బిట్ కాయిన్ ప్రభావం
నిర్మల్ జిల్లా వ్యాప్తంగా ఈ విద్యా ఫలితాలలో బిట్ కాయిన్ ప్రభావం చూపినట్లు కనిపిస్తుందని పలువురు ఆరోపిస్తున్నారు. కొందరు ప్రభుత్వ ఉపాధ్యాయులు బిట్ కాయిన్ ఊబిలో చిక్కుకుపోవడంతో ఫలితాల శాతం లో లోటు ఏర్పడిందని విమర్శిస్తున్నారు. కొందరు ఉపాధ్యాయులు బిట్ కాయిన్ అక్రమ వ్యాపారం లో ఇరుక్కుని జైలు పాలు కాగా, మరికొందరు ఉపాధ్యాయులు విదేశీ పర్యటనలు సైతం పరిటాల పై ప్రభావం చూపిందంటూ పలువురు గుసగుసలాడుతున్నారు.
సమన్వయ లోపమే కారణమా..?
పదవ తరగతి పరీక్షలకు కొన్ని రోజుల ముందు డీఈఓ ల బదిలీ జరిగిన విషయం తెలిసిందే. కాగా నూతనంగా వచ్చిన డిఇఓ కు ఎంఈఓ లు, ఉపాధ్యాయులకు మధ్య సమన్వయ లోపం కారణంగానే 10 ఫలితాలలో జిల్లాకు 15వ స్థానం వచ్చినట్లు పలువురు విద్యావేత్తలు చర్చించుకుంటున్నారు. నూతనంగా వచ్చిన డిఇఓ ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులతో సమన్వయం చేసుకోవడానికి తక్కువ సమయం ఉండటంతో ఊహించిన ఫలితాలు రాలేవని పలువురు ఆరోపిస్తున్నారు.
ఇకనైనా బుధవారం ప్రకటించిన ఫలితాలను విమర్శనాత్మకంగా పరిశీలనలోకి తీసుకొని ఎక్కడ తప్పు జరిగిందో గుర్తించి రాబోయే పదవ తరగతి పరీక్షలలో జిల్లాను మొదటి స్థానంలో నిలపడానికి ఉపాధ్యాయులను సమన్వయ పరుచుకుంటూ జిల్లా విద్యాశాఖ అధికారి కృషి చేయాలని పలువురు విద్యావేత్తలు, విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.