Wednesday, July 16, 2025

అర్హులందరికీ రేషన్ కార్డులు:ఓరుగల్లు9నేషనల్ టీవీ

ఓరుగల్లు9నేషనల్ టీవీ :రాష్ట్రంలో అర్హులందరికీ తెల్ల రేషన్ కార్డులు మంజూరు చేయాలని కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది. విధివిధానాలపై మరింత లోతుగా అధ్యయనం చేశాకే, దీనిపై ముందుకెళ్తామని తెలిపింది. రాజకీయాలకతీతంగా ప్రజాప్రతినిధుల నుంచి సలహాలు, సూచనలు తీసుకుంటామని చెప్పింది. రేషన్ కార్డుల జారీపై ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ సమావేశం శనివారం సెక్రటేరియెట్​లో జరిగింది. కమిటీ చైర్మన్, సివిల్ సప్లయ్స్ శాఖ మంత్రి ఉత్తమ్​కుమార్​రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కమిటీ సభ్యులు, మంత్రులు దామోదర రాజనర్సింహ, పొంగులేటి శ్రీనివాస్​రెడ్డితో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

తెల్ల రేషన్​కార్డుల జారీకి అర్హతలను ఖరారు చేసేందుకు ఎలాంటి విధివిధానాలు ఉండాలనే దానిపై సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా గ్రామీణ ప్రాంతాల్లో రూ.లక్షన్నర వార్షికాదాయం, ఆ కుటుంబానికి మూడున్నర ఎకరాల మాగాణి లేదంటే ఏడున్నర ఎకరాల చెల్క భూమిని పరిమితిగా విధించాలనే ప్రతిపాదన కేబినెట్ సబ్​కమిటీ ముందుకొచ్చింది. పట్టణ ప్రాంతాల్లో అయితే భూమిని పరిగణనలోకి తీసుకోకుండా, రూ.2 లక్షల వార్షికాదాయ పరిమితి పెట్టాలనే ప్రపోజల్ వచ్చింది. అర్బన్​ఏరియాలో సొంత ఇల్లు ఉన్నోళ్లకు, ఆ ఇంటి స్థాయిని బట్టి నిర్ణయం తీసుకోవాలనే అంశంపైనా చర్చ జరిగింది.

దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నోళ్లందరికీ తెల్ల రేషన్ కార్డులు మంజూరు చేస్తామని, విధివిధానాల రూపకల్పన కోసం మరింత లోతుగా అధ్యయనం చేస్తున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్​రెడ్డి​ తెలిపారు. ఇందులో భాగంగా రాజకీయాలకు అతీతంగా ప్రజాప్రతినిధులందరి నుంచి సలహాలు, సూచన లు తీసుకుంటామని చెప్పారు. దీనిపై త్వరలోనే ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు లేఖలు రాయా లని సివిల్ సప్లయ్స్ కమిషనర్ ​డీఎస్ చౌహాన్​ను ఆదేశించారు. ‘‘తెల్ల రేషన్​కార్డుల జారీ కోసం డాక్టర్ ఎన్సీ సక్సేనా కమిటీ సిఫార్సులను కూడా పరిగణనలోకి తీసుకుంటాం. ఈ కమిటీలో సుప్రీంకోర్టు స్పెషల్ కమిషనర్ హర్ష మండర్ సభ్యుడిగా ఉన్నారు” అని పేర్కొన్నారు. ‘‘వివిధ రాష్ట్రాలు తెల్ల రేషన్ కార్డుల జారీకి అనుసరిస్తున్న విధివిధానాలపై అధికారుల బృందం ఇప్పటికే అధ్యయనం చేసింది. ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు వలస వచ్చినోళ్లకు అక్కడ, ఇక్కడ రెండు చోట్లా రేషన్ కార్డులు ఉన్నట్టు మా పరిశీలనలో తేలింది.

అలాంటి వాళ్లు ఎక్కడో ఓ చోట కార్డు ఉంచుకునేలా ఆప్షన్ ఇవ్వాలనే ప్రతిపాదనపైనా చర్చించాం. ప్రస్తుతం రాష్ట్రంలో 89.96 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. మేం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజా పాలన కింద దరఖాస్తులు తీసుకోగా, దాదాపు 10 లక్షల అప్లికేషన్లు వచ్చాయి. డాక్టర్​ఎన్సీ సక్సేనా కమిటీ బీపీఎల్​ కింద కుటుంబాన్ని గుర్తించేందుకు 2010లో కొన్ని రికమండేషన్స్ ఇచ్చింది. గ్రామాల్లో అయితే వారికున్న భూములు, వాహనాలు, వ్యవసాయ యంత్రాలతో పాటు ఎంప్లాయీస్​ అయితే రెగ్యులర్​ ఎంప్లాయ్​మెంట్, ఇన్​కమ్ ట్యాక్స్​పేయర్స్ లాంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని సిఫార్సు చేసింది. ఆ విధివిధానాలపైనా అధ్యయనం చేశాకే ఈ అంశంపై ముందుకెళ్తాం” అని ఉత్తమ్ తెలిపారు.

కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజా పాలనలో భాగంగా అభయ హస్తం కింద ఆరు గ్యారంటీల అమలుకు అప్లికేషన్లు తీసుకున్నది. ఈ క్రమంలో రేషన్​ కార్డుల కోసం రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 10 లక్షల అప్లికేషన్లు వచ్చాయి. ఇటీవల జరిగిన కేబినెట్ మీటింగ్​లో రేషన్​ కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులు వేర్వేరుగా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. దీనిపై స్టడీ చేసేందుకు ప్రభుత్వం కేబినెట్​ సబ్​ కమిటీని ఏర్పాటు చేసింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular